ఎయిర్‌టెల్‌ లాభంలో 49% వృద్ధి

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,005.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.2,007.80 కోట్లతో పోలిస్తే ఇది 49.2% అధికం.

Updated : 17 May 2023 03:18 IST

దిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,005.60 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.2,007.80 కోట్లతో పోలిస్తే ఇది 49.2% అధికం. ఏకీకృత ఆదాయం రూ.31,500.30 కోట్ల నుంచి 14.31% పెరిగి రూ.36,009 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్‌ భారత వ్యాపారం సమీక్షా త్రైమాసికంలో 12.2% పెరిగి రూ.25,250 కోట్లకు చేరగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 19% పెరిగి రూ.82,487.70 కోట్లకు ఎగబాకింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎయిర్‌టెల్‌ నికర లాభం రూ.4,255 కోట్ల నుంచి రూ.8,346 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.1,16,546.90 కోట్ల నుంచి 19.3% పెరిగి రూ.1,39,144.80 కోట్లకు చేరింది.

ఆర్పు రూ.178 నుంచి రూ.193కు..: ‘మరొక బలమైన త్రైమాసికాన్ని నమోదు చేశాం. నాణ్యమైన ఖాతాదార్లను చేజిక్కించుకోవడంపైనే దృష్టి నిలిపి 74 లక్షల మంది కొత్త 4జీ వినియోగదార్లను సొంతం చేసుకున్నాం. దీంతో ఒక్కో వినియోగదారుడిపై సరాసరి ఆర్జన (ఆర్పు) రూ.178 నుంచి రూ.193కు చేరింద’ని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విత్తల్‌ వెల్లడించారు.

ఫలితాల్లో మరిన్ని అంశాలు..: ఎయిర్‌టెల్‌ ఇండియా మొబైల్‌ సేవల ఆదాయం సమీక్షా త్రైమాసికంలో రూ.17,526.20 కోట్ల నుంచి 12% పెరిగి రూ.19,549.30 కోట్లకు చేరింది. ఈ సేవల వ్యాపార వార్షిక ఆదాయం రూ.62,915.10 కోట్ల నుంచి 21% పెరిగి రూ.75,924.60 కోట్లకు చేరింది.

* కంపెనీ మూలధన వ్యయాలు సమీక్షా త్రైమాసికంలో రూ.8,989.40 కోట్లకు చేరాయి. 2021-22 ఇదే త్రైమాసికంలో ఇవి రూ.4,276.70 కోట్లు మాత్రమే. దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ నిర్మాణానికే ఇందులో అధిక భాగం (రూ.6,647.10 కోట్లు) నిధులు వెచ్చించింది. నెట్‌వర్క్‌ కవరేజీని బలోపేతం చేసేందుకు 12,500 అదనపు టవర్లను ఏర్పాటు చేసినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.

* కంపెనీకి మొత్తం చందాదార్ల సంఖ్య 48.97 కోట్ల నుంచి 51.84 కోట్లకు చేరింది. భారత్‌లో 35.83 కోట్ల నుంచి 4.7 శాతం పెరిగి 37.53 కోట్లకు చేరారు. ఇందులో 4జీ వినియోగదార్లు 20.84 కోట్ల నుంచి 11.6 శాతం పెరిగి 22.41 కోట్లకు చేరారు.

* ఒక్కో వినియోగదారుడి డేటా వినియోగం సరాసరిన 18.77 జీబీ నుంచి 20 జీబీకి చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన మాత్రం ఇది తగ్గడం గమనార్హం.


ఐఓసీ లాభం రూ.10,059 కోట్లు

దిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) మార్చి త్రైమాసికంలో రూ.10,058.69 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.6,021.88 కోట్లతో పోలిస్తే ఇది 67 శాతం అధికం. నాలుగో త్రైమాసికంలో ఇంధన మార్కెటింగ్‌ మార్జిన్లలో రికవరీ, మంచి రిఫైనింగ్‌ మార్జిన్లతో నికర లాభం బాగా పెరిగిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.8,241.82 కోట్లకు పెరిగేందుకూ దోహదం చేసింది.

* 2022-23 తొలి అర్ధ భాగంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచకపోవడంతో నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిని పూడ్చుకుని పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభాలు నమోదు చేయడానికి మార్చి త్రైమాసికం బాగా తోడ్పడింది. గత ఏడాది ఏప్రిల్‌ 6 నుంచి పెట్రోలు, డీజిల్‌ ధరలను ఐఓసీతో పాటు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లు పెంచలేదు. అప్పట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర 100 డాలర్ల దరిదాపుల్లో ఉండటంతో నష్టాలు వచ్చాయి. ఇప్పుడు బ్యారెల్‌ ధర 75 డాలర్ల కంటే తక్కువకు చేరడంతో కంపెనీలు మంచి మార్జిన్లు పొందుతున్నాయి.

* 2021-22లో నమోదు చేసిన రూ.24,184 కోట్లతో పోలిస్తే మాత్రం గత ఆర్థిక సంవత్సరం లాభం తక్కువగా నమోదైంది. మార్కెటింగ్‌, పెట్రో రసాయనాల మార్జిన్లు తగ్గడం, మారకపు నష్టాలు ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.

* రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.3 తుది డివిడెండు చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించింది.

* మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.2.26 లక్షల కోట్లకు చేరింది. మార్కెటింగ్‌ విక్రయాలు 21.789 మిలియన్‌ టన్నుల నుంచి 22.95 మిలియన్‌ టన్నులకు చేరాయి.

* పూర్తి ఆర్థిక సంవత్సరానికి 90.65 మి.టన్నుల ఇంధనాన్ని ఐఓసీ విక్రయించింది. 2021-22లో 80.49 మి.టన్నుల ఇంధనాన్ని అమ్మింది. ప్రతి బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చే క్రమంలో ఐఓసీ స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎం) 11.25 డాలర్ల నుంచి 19.52 డాలర్లకు చేరింది. ఇన్వెంటరీ నష్టం/లాభం సర్దుబాటు తర్వాత జీఆర్‌ఎం 20.14 డాలర్లుగా నమోదైంది.

* 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులతో కలిపి మొత్తం 95.714 మి.టన్నుల ఉత్పత్తులను ఇండియన్‌ ఆయిల్‌ విక్రయించిందని ఐఓసీ ఛైర్మన్‌ ఎస్‌ఎం వైద్య వెల్లడించారు. 72.408 మి.టన్నుల ముడి చమురును శుద్ధి చేసినట్లు పేర్కొన్నారు.


బీఓబీ లాభం రూ.4,775 కోట్లు

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.4,775.33 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.1,778.77 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.18,174 కోట్ల నుంచి రూ.25,857 కోట్లకు చేరింది. మొండి బకాయిలు, ఆకస్మిక నిధికి కేటాయింపులు రూ.3,736 కోట్ల నుంచి రూ.1,420 కోట్లకు తగ్గాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బీఓబీ నికర లాభం రూ.7,272 కోట్ల నుంచి రూ.14,109 కోట్లకు చేరింది.

* సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 33.8 శాతం పెరిగి రూ.11,525 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.07 శాతం నుంచి 3.53 శాతానికి పెరిగింది. ఫీజు ఆదాయం రూ.1,638 కోట్ల నుంచి 4.6 శాతం పెరిగి రూ.1,714 కోట్లకు చేరింది.

* అధిక ఎన్‌ఐఎం ఆశ్చర్యానికి గురి చేసిందని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ సంజీవ్‌ చద్దా వెల్లడించారు. 2023-24లోనూ 3.5 శాతం ఎన్‌ఐఎంను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11-13 శాతం కార్పొరేట్‌ రుణ వృద్ధితో మొత్తం రుణ వృద్ధి 13-14 శాతం ఉండేలా చూస్తామన్నారు.

* సమీక్షా త్రైమాసికంలో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.5,200 కోట్ల నుంచి 94 శాతం తగ్గి రూ.320 కోట్లకు పరిమితమయ్యాయి.

* స్థూల నిరర్థక ఆస్తులు 6.61 శాతం నుంచి 3.79 శాతానికి మెరుగయ్యాయి. డిసెంబరు త్రైమాసికంలో ఇవి 4.53 శాతంగా ఉన్నాయి.

* ఇటీవల దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న గోఫస్ట్‌కు బ్యాంక్‌ రూ.1,300 కోట్ల రుణాలు అందించిందని, అందుకే రూ.500 కోట్ల కేటాయింపులు చేసినట్లు చద్దా వివరించారు.

* 2023 మార్చి 31 నాటికి బ్యాంక్‌ కనీస మూలధన నిష్పత్తి 16.24 శాతంగా ఉంది.

* జీవిత బీమా అనుబంధ సంస్థను మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ఐపీఓకు తీసుకురావాలనుకుంటన్నట్లు తెలిపారు. దీనికి 2024 మార్చి వరకు సమయం ఉందన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని