భారత్‌లో అమెజాన్‌ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

భారత్‌లో క్లౌడ్‌ మౌలిక వసతులపై 12.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.05 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) గురువారం ప్రకటించింది.

Published : 19 May 2023 02:03 IST

2030 కల్లా క్లౌడ్‌ వసతులపై పెట్టనున్న ఏడబ్ల్యూఎస్‌
ఏటా 1.31 లక్షల ఉద్యోగాలకు వీలు

ముంబయి: భారత్‌లో క్లౌడ్‌ మౌలిక వసతులపై 12.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.05 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) గురువారం ప్రకటించింది. దేశంలో క్లౌడ్‌ సేవలకు పెరుగుతున్న గిరాకీని అందుకోవడం కోసమే 2030 వరకు ఈ పెట్టుబడులు పెడుతుంది. డేటా సెంటర్లపై పెట్టే ఈ పెట్టుబడుల ద్వారా ఏటా సగటున భారత కంపెనీల్లో పూర్తి స్థాయికి సమానమైన(ఎఫ్‌టీఈ) 1,31,700 ఉద్యోగాలు లభిస్తాయని అమెజాన్‌కు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ యూనిట్‌ తెలిపింది.

ఈ ఉద్యోగాలొస్తాయ్‌..: నిర్మాణం, ప్లాంటు నిర్వహణ, ఇంజినీరింగ్‌, టెలికమ్యూనికేషన్లు, ఇతర ఉద్యోగాలు ఈ డేటా సెంటర్ల సరఫరా వ్యవస్థలో భాగంగా లభించనున్నాయి. ఈ పెట్టుబడుల వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలోనూ సిబ్బంది అభివృద్ధి, శిక్షణ, నైపుణ్య అవకాశాలు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌, సస్టెయినబిలిటీ కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని కంపెనీ వివరించింది.

జీడీపీకి ఎంత కలిసొస్తుందంటే..: 2016-22 మధ్య దేశంలో పెట్టిన రూ.30,900 కోట్ల పెట్టుబడులకు, తాజా ప్రతిపాదనలు కూడా కలిపితే  2030 కల్లా మొత్తం మీద మా పెట్టుబడులు రూ.1,36,500 కోట్ల(16.4 బి. డాలర్లు)కు చేరతాయని అమెజాన్‌ పేర్కొంది. ఈ పెట్టుబడుల వల్ల భారత స్థూల దేశీయోత్పత్తికి 2030 కల్లా రూ.1,94,700 కోట్లు (23.3 బి. డాలర్లు) సమకూరతాయని కంపెనీ పేర్కొంది.

హైదరాబాద్‌లో ఒకటి.. ముంబయిలో ఒకటి..: అమెజాన్‌ ఇప్పటికే ముంబయి, హైదరాబాద్‌లలో ఒక్కో డేటా కేంద్రం ఉంది. 2016 నవంబరులో ఏడబ్ల్యూఎస్‌ ఏసియా పసిఫిక్‌(ముంబయి) రీజియన్‌; 2022 నవంబరులో ఏడబ్ల్యూఎస్‌ ఏసియా పసిఫిక్‌(హైదరాబాద్‌) రీజియన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై మూలధనం, నిర్హహణ వ్యయాలు కలిపి రూ.30,900 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. తద్వారా 2016-22 మధ్య జీడీపీకి ఏడబ్ల్యూఎస్‌ రూ.38,200 కోట్లు(4.6 బి. డాలర్లు) సమకూర్చినట్లయింది. ఈ పెట్టుబడుల వల్ల ఏటా 39,500 ఎఫ్‌టీఈ ఉద్యోగాలకు మద్దతు లభించింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న డిజిటల్‌ ఇండియా దృక్పథమే భారత్‌లో క్లౌడ్‌, డేటా సెంటర్ల విస్తరణకు కారణమవుతోందని ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని