ఏప్రిల్‌లో దేశీయ విమాన ప్రయాణికులు 1.29 కోట్లు

గత నెలలో (ఏప్రిల్‌) దేశీయ విమానాల్లో 1.29 కోట్ల మంది ప్రయాణించారు. 2022 ఏప్రిల్‌లో ప్రయాణించిన 1.05 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 22%.

Published : 20 May 2023 02:49 IST

ముంబయి: గత నెలలో (ఏప్రిల్‌) దేశీయ విమానాల్లో 1.29 కోట్ల మంది ప్రయాణించారు. 2022 ఏప్రిల్‌లో ప్రయాణించిన 1.05 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 22% అధికమని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ప్రయాణించిన 1.28 కోట్ల మందితో పోలిస్తే.. ఏప్రిల్‌లో స్వల్పంగా తగ్గారు.

ఇండిగో వాటా 57.5%: విమాన ప్రయాణికులను చేరవేయడంలో మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో, ఇండిగో మార్కెట్‌ వాటా 56.8% నుంచి 57.5 శాతానికి పెరిగింది. ఎయిరిండియా మార్కెట్‌ వాటా 8.8% నుంచి 8.6 శాతానికి తగ్గింది. విస్తారా వాటా 8.9% నుంచి 8.7 శాతానికి, స్పైస్‌జెట్‌ వాటా 6.4% నుంచి 5.8 శాతానికి, గోఫస్ట్‌ వాటా 6.9% నుంచి 6.4 శాతానికి తగ్గింది. ఎయిరేషియా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్‌ కనెక్ట్‌) మార్కెట్‌ వాటా ఎలాంటి మార్పు లేకుండా 7.6 శాతంగానే ఉంది. ఆకాశ ఎయిర్‌ మార్కెట్‌ వాటా 3.3% నుంచి 4 శాతానికి పెరిగింది.

సమయపాలనలో: ఆకాశ ఎయిర్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ విమానాలు 94% నిర్ణీత సమయంలో రాకపోకలు సాగించాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిరిండియా (91.1%), ఇండిగో (89.6%) ఉన్నాయి. ఈ నెల 3 నుంచి విమానాలను రద్దు చేసుకున్న గోఫస్ట్‌ సమయ పాలన అత్యంత తక్కువగా 41.7 శాతంగా నమోదైంది.

ఈ ఏడాది జనవరి- ఏప్రిల్‌లో దేశీయ విమానాల్లో మొత్తం 5.04 కోట్ల మంది ప్రయాణించారు. కిందటేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 3.53 కోట్లుగా ఉందని డీజీసీఏ తెలిపింది. అంటే 42.88% వార్షిక వృద్ధి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని