పీఎన్‌బీ లాభం 5 రెట్లు

మార్చి త్రైమాసికంలో  రూ.1,159 కోట్ల నికరలాభాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక స్టాండలోన్‌ నికరలాభం రూ.202 కోట్లతో పోలిస్తే, ఈ మొత్తం 5 రెట్ల కంటే అధికం.

Published : 20 May 2023 02:52 IST

డివిడెండు రూ.0.65

దిల్లీ: మార్చి త్రైమాసికంలో  రూ.1,159 కోట్ల నికరలాభాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక స్టాండలోన్‌ నికరలాభం రూ.202 కోట్లతో పోలిస్తే, ఈ మొత్తం 5 రెట్ల కంటే అధికం. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ ఆదాయం పెరగడం ఇందుకు కారణం. ఇదే సమయంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.21,095 కోట్ల నుంచి రూ.27,269 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.18,645 కోట్ల నుంచి రూ.23,849 కోట్లకు పెరగడం కలిసొచ్చింది. నికర వడ్డీ ఆదాయం 30.05 శాతం వృద్ధితో రూ.9,499 కోట్లకు చేరింది. ఇది గత 5 త్రైమాసికాల్లోనే అత్యుత్తమమని పీఎన్‌బీ ఎండీ అతుల్‌ కుమార్‌ గోయెల్‌ పేర్కొన్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.0.65 డివిడెండును బ్యాంకు బోర్డు సిఫారసు చేసింది.

రూ.29,000 కోట్ల రికవరీ: 2022-23లో బ్యాంకు రూ.29,000 కోట్లను రికవరీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.22,000 కోట్లు రికవరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22లో 11.78 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 2023 మార్చికి 8.74 శాతానికి తగ్గాయి. ఇదే కాలంలో నికర నిరర్థక ఆస్తులు  4.8 శాతం నుంచి 2.72 శాతానికి తగ్గాయి. వచ్చే మార్చికి స్థూల ఎన్‌పీఏలు 7% దిగువకు; నికర ఎన్‌పీఏలు 2% దిగువకు చేర్చాలన్నది లక్ష్యమని గోయెల్‌ అన్నారు. ఎన్‌పీఏలకు కేటాయింపులు  రూ.4,564 కోట్ల నుంచి రూ.3,625 కోట్లకు తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌) 2.76% నుంచి 3.24 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.9-3.0 శాతంగా నమోదుకావొచ్చని అంచనా వేస్తోంది.

పూర్తి ఏడాదికి లాభంలో క్షీణత: 2022-23 మొత్తం బ్యాంకు నికర లాభం రూ.2,507 కోట్లకు పరిమితమైంది. 2021-22 నాటి రూ.3,457 కోట్ల కంటే ఇది 27% తక్కువ. 2022 మార్చి చివర్లో 14.5 శాతంగా ఉన్న కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 15.5 శాతానికి పెరిగింది. టైర్‌ 1, టైర్‌2 బాండ్ల జారీ ద్వారా రూ.12,000 కోట్లను సమీకరించాలని బ్యాంకు భావిస్తున్నట్లు ఎండీ తెలిపారు.

ఏకీకృత పద్ధతిలో..: నాలుగో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.245 కోట్ల నుంచి రూ.1,864 కోట్లకు; ఏకీకృత ఆదాయం రూ.21,350.59 కోట్ల నుంచి రూ.28,132.23 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికరలాభం రూ.3,675.96 కోట్ల నుంచి రూ.3,348.45 కోట్లకు తగ్గితే; మొత్తం ఆదాయం మాత్రం రూ.88,339.49 కోట్ల నుంచి రూ.99,084.88 కోట్లకు పెరిగింది.

ఉద్యోగులకు 15 కోట్ల కొత్త షేర్లు: ఒక్కోటీ రూ.2 ముఖ విలువ గల 15 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈక్విటీ మూలధనాన్ని సమీకరించడానికి బోర్డు అనుమతినిచ్చింది. వీటిని ‘ఎంప్లాయీస్‌ స్టాక్‌ పర్చేస్‌ స్కీమ్‌’ ద్వారా ఇవ్వనుంది.


బంధన్‌ బ్యాంక్‌ లాభంలో 58% క్షీణత

దిల్లీ: మార్చి త్రైమాసికంలో బంధన్‌ బ్యాంక్‌ స్టాండలోన్‌ నికర లాభం 58 శాతం క్షీణించి రూ.808 కోట్లకు పరిమితమైంది. అధిక కేటాయింపులు ఇందుకు కారణమయ్యాయి. 2021-22 ఇదే మూడు నెలల్లో బ్యాంకు లాభం రూ.1902 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.4,844 కోట్ల నుంచి రూ.4,897.38 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.3,872 కోట్ల నుంచి రూ.4,268 కోట్లకు పెరగ్గా.. నికర వడ్డీ ఆదాయం రూ.2,540 కోట్ల నుంచి 3% తగ్గి రూ.2,470 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.1.50 డివిడెండును బ్యాంకు బోర్డు సిఫారసు చేసింది. స్థూల నిరర్థక ఆస్తులు 6.46 శాతం నుంచి 4.87 శాతానికి; నికర నిరర్థక ఆస్తులు 1.66% నుంచి 1.17 శాతానికి తగ్గాయి. వీటికి కేటాయింపులు రూ.5 కోట్ల నుంచి రూ.735 కోట్లకు పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.3,457 కోట్ల నుంచి 27% తగ్గి రూ.2,507 కోట్లకు పరిమితమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు