వడ్డీ రేట్లు తగ్గుతాయా?

ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించిన నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గుతాయా అనే అంశం చర్చకు తావిస్తోంది.

Updated : 21 May 2023 07:15 IST

రూ.2వేల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో ఎఫ్‌డీ డిపాజిటర్ల ఆందోళన
రుణగ్రహీతల ఎదురుచూపు
ఈనాడు - హైదరాబాద్‌

ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించిన నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గుతాయా అనే అంశం చర్చకు తావిస్తోంది. 2016లో రూ.1,000, రూ.500 నోట్లు రద్దు అయినప్పుడు ఒక్కసారిగా బ్యాంకు పొదుపు ఖాతాల్లోకి డిపాజిట్లు వచ్చాయి. ఇప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయి. ఇందులో సింహభాగం బ్యాంకు కరెంట్‌, పొదుపు ఖాతాలోకి రావచ్చనే అంచనాలున్నాయి. రూ.20 వేల వరకూ మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, మొత్తం ఖాతాల్లోనే డిపాజిట్‌ కాకపోవచ్చు. ఎలా చూసుకున్నా రూ.3 లక్షల కోట్ల వరకూ కాసా (కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్‌ అకౌంట్‌) డిపాజిట్లు ఉంటాయని బ్యాంకింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు ద్రవ్యలభ్యత ఒత్తిడి తగ్గే అవకాశాలున్నాయి. ఫలితంగా రుణాలను ఇచ్చేందుకు టర్మ్‌ డిపాజిట్లపై ఆధారపడాల్సిన అవసరం కనీసం ఆరు నెలల వరకూ ఉండకపోవచ్చని వారు అంటున్నారు.

ప్రభావం ఏమిటి?

గత ఏడాది ప్రారంభంలో వడ్డీ రేట్లు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ద్రవ్యోల్బణం లక్షిత స్థాయిని మించి పెరగడంతో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేటు రెపోను పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం ఇది 6.50 శాతం వద్ద ఉంది. గత పరపతి విధానంలో మరో 0.25 శాతం పెరుగుతుందని అనుకున్నా, ఆర్‌బీఐ స్థిరంగానే ఉంచింది. దీంతో గత రెండు నెలలుగా బ్యాంకులూ ఎఫ్‌డీ, ఎంసీఎల్‌ఆర్‌(నిధుల ఆధారిత రుణ రేట్లు) వడ్డీలను సవరించలేదు.

మరోవైపు, గత రెండు మూడు రోజులుగా కొన్ని ప్రభుత్వ బ్యాంకులు రెండేళ్లు, అంతకు మించిన టర్మ్‌ డిపాజిట్‌ రేట్లపై పావు శాతం వరకూ వడ్డీని తగ్గించాయి. వచ్చే నెలలో ఆర్‌బీఐ పరపతి సమీక్ష ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకు రెపో రేటును స్థిరంగా ఉంచుతుందా? లేదా పావు శాతం మేరకు తగ్గిస్తుందా అనేది కీలకంగా మారనుంది. రూ.2వేల నోట్ల జమ వల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి చెప్పుకోదగ్గ మొత్తమే రానున్న నేపథ్యంలో తగ్గింపు వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది.

అప్పులు తీసుకున్న వారికి..

రెపో రేటు పెరగడంతో.. దీని ఆధారంగా బ్యాంకులు వసూలు చేసే ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌(రెపో ఆధారిత రుణ వడ్డీ రేటు) రుణ గ్రహీతలకు భారంగా మారింది. ఇప్పుడు గృహరుణాల రేటు 9 శాతానికి మించి పోయింది. 7 శాతం ఉన్నప్పుడు రుణాలు తీసుకున్న వారికి వ్యవధి ఏకంగా 8-9 ఏళ్లపాటు పెరిగింది. ఆర్‌బీఐ మళ్లీ రుణాల రేట్లు తగ్గిస్తే తప్ప వీరికి కాస్త ఉపశమనం లభించదు. అప్పట్లో పెద్ద నోట్ల ఉపసంహరణ సమయంలో వడ్డీ రేట్లు కొంత మేరకు తగ్గాయి. ఈసారీ అలాగే తగ్గితే బాగుంటుందని రుణ గ్రహీతలు కోరుకుంటున్నారు.


ప్రస్తుతానికి రూ.1000 నోట్ల అవసరమైతే లేదు

నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ పనగడియా

దిల్లీ: చలామణిలో ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్ల ఉపసంహరణతో ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం లేదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకులకు వెనక్కి తరలి వచ్చే రూ.2,000 నోట్ల స్థానంలో అందుకు సమానమైన విలువ గల తక్కువ విలువ నోట్లను భర్తీ చేస్తారు గనుక ఇబ్బందులేమీ రావని పేర్కొన్నారు. అక్రమంగా డబ్బులు తరలించడాన్ని నిరోధించడమే రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని వివరించారు. ప్రజల చేతుల్లో ఉన్న మొత్తం నగదులో 10.8 శాతం మాత్రమే రూ.2,000 నోట్ల రూపంలో ఉందని, ఇందులో అధిక భాగం అక్రమ లావాదేవీలకే ఉపయోగిస్తున్నారని తెలిపారు. రూ.1,000 కరెన్సీ నోట్లను మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఇప్పటికైతే లేదని, రూ.500 అంతకంటే తక్కువ విలువ కలిగిన నోట్లను ప్రజలు లావాదేవీల కోసం వినియోగిస్తున్నారని వెల్లడించారు.

డిజిటల్‌ చెల్లింపులు బాగా పెరిగాయ్‌: రూ.2,000 నోట్ల ఉపసంహరణతో ఆర్థిక వ్యవస్థతో పాటు ద్రవ్య పరపతి విధానంపైనా ఎలాంటి ప్రభావం ఉండబోదని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ కూడా తెలిపారు. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ కొరతను తాత్కాలికంగా తీర్చేందుకు రూ.2,000 నోట్లను తీసుకొచ్చారని పేర్కొన్నారు. గత 5-6 ఏళ్లలో డిజిటల్‌ చెల్లింపులు బాగా పెరిగినందున, రూ.2,000 నోట్లను ఉపసంహరించి వాటి స్థానంలో ఇతర తక్కువ విలువ కలిగిన నోట్లను భర్తీ చేయడం వల్ల వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీపై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించారు. అలాగే ద్రవ్య పరపతి విధానంపైనా ఆ ప్రభావం కనిపించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జీడీపీ వృద్ధి, ప్రజా సంక్షేమంపైనా ఎలాంటి ప్రభావం కనిపించిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని