తగ్గిన దొడ్ల డెయిరీ లాభం

దొడ్ల డెయిరీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,812 కోట్ల ఆదాయం లభించింది. దీనిపై రూ.122 కోట్ల నికర లాభం, రూ.20.39 ఈపీఎస్‌ నమోదయ్యాయి.

Published : 21 May 2023 01:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: దొడ్ల డెయిరీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,812 కోట్ల ఆదాయం లభించింది. దీనిపై రూ.122 కోట్ల నికర లాభం, రూ.20.39 ఈపీఎస్‌ నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.2,243 కోట్లు, నికర లాభం రూ.132 కోట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తే ఆదాయం పెరిగినప్పటికీ, నికర లాభం తగ్గింది. విలువ జోడించిన ఉత్పత్తుల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం పెరిగినట్లు దొడ్ల డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ రెడ్డి తెలిపారు.


పరిశ్రమ వృద్ధికి మించి అమ్మకాలు

2023-24లో భారత విపణిపై సుజకీ ఆశాభావం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు అంచనా అయిన 5-7 శాతానికి మించి తమ వాహన అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. మారుతీ సుజుకీలో ఈ జపాన్‌ సంస్థకు 56.4% వాటా ఉంది. స్పోర్ట్‌ యుటిలిటీ విభాగంలో (ఎస్‌యూవీలు) కొత్త మోడళ్లను పరిచయం చేయడం ద్వారా తాను కోల్పోయిన మార్కెట్‌ వాటాను తిరిగి పొందాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించింది. భారత విపణిలో కర్బన తటస్థతకు తమ వంతు పాత్రగా సహకరించేందుకు కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాలపైనే ఆధారపడకుండా.. సీఎన్‌జీ, హైబ్రీడ్‌ మోడళ్లకూ ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.
విక్రయాలు, లాభాల్లో వృద్ధి..: 2022-23లో ఏకీకృత ప్రాతిపదికన నికర విక్రయాలు 30.1 శాతం పెరిగి 4,641.6 బిలియన్‌ యెన్‌లుగా నమోదయ్యాయని సుజుకీ ఇటీవల వెల్లడించింది. నిర్వహణ లాభం 350.60 బిలియన్‌ యెన్‌ల నుంచి 83.1 శాతం వృద్ధితో 159.10 బిలియన్‌ యెన్‌లకు చేరింది. మారకపు రేట్ల ప్రభావం, భారత్‌, జపాన్‌, ఆఫ్రికాల్లో అమ్మకాలు పెరగడం వల్లే తమ లాభాలు, విక్రయాలు పెరిగాయని కంపెనీ తెలిపింది.


విమాన టికెట్ల ధరలను తగ్గించండి

కంపెనీలకు ప్రభుత్వం సూచన!

దిల్లీ: విమాన టికెట్లను తగ్గించేందుకు ప్రయత్నించాలని.. తద్వారా ధరల విషయంలో సమతుల్యతను తీసుకురావాలని విమానయాన సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. గోఫస్ట్‌ విమానాల రద్దు అనంతరం కొన్ని మార్గాల్లో ధరలు పెరగడం ఇందుకు నేపథ్యమని సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, విమాన ఛార్జీలను నియంత్రించే ప్రణాళికలేవీ లేవని ఆ అధికారి స్పష్టం చేశారు. అయితే విమానయాన కంపెనీలు విక్రయించే టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరల మధ్య అంతరం భారీగా ఉండరాదని అన్నారు. మే 3 నుంచి గోఫస్ట్‌ విమానాలు రద్దు అయిన అనంతరం దిల్లీ-శ్రీనగర్‌, దిల్లీ-పుణె వంటి మార్గాల్లో టికెట్‌ ధరల్లో గణనీయ పెరుగుదల కనిపించింది. దిల్లీ-లేహ్‌ మార్గంలో టికెట్‌ ధర ఏప్రిల్‌ 20-28తో పోలిస్తే మే 3-10 మధ్య 125% పెరిగి సగటున రూ.13,674కు చేరింది. దిల్లీ-శ్రీనగర్‌ మార్గంలోనూ టికెట్‌ రేటు 86% పెరిగి రూ.16,898కి చేరింది.


ట్విటర్‌కు పోటీగా మెటా కొత్త యాప్‌

దిల్లీ: ట్విటర్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌పై కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి టెస్టింగ్‌ నిర్వహిస్తోందని సమాచారం. సంబంధిత స్క్రీన్‌షాట్లు సైతం బయటకొచ్చాయి. ఈ యాప్‌నకు ఇంతవరకు పేరు పెట్టనప్పటికీ.. పీ92, బార్సిలోనా పేర్లతో అంతర్గతంగా పిలుచుకుంటున్నారు. ఇది ప్రత్యేక యాప్‌గానే ఉండబోతోందని, ఇన్‌స్టా యూజర్లు తమ ఖాతాతో కనెక్ట్‌ అయ్యేందుకు వీలు కల్పిస్తారని సమాచారం. జూన్‌లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్‌స్టాను పోలి ఉన్నా.. ఫొటోలు, వీడియోలతో కూడిన ఫీడ్‌ కాకుండా టెక్ట్స్‌ ఆధారిత టైమ్‌లైన్‌ పోస్టులు కనిపించనున్నాయి. అంటే ఇది ట్విటర్‌ను పోలి ఉండబోతోందన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు