61,000 దిగువన స్థిరీకరణకు అవకాశం!

బలహీన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గత వారం మన సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. దేశీయ స్థూల గణాంకాలు, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపాయి.

Updated : 22 May 2023 06:46 IST

సమీక్ష: బలహీన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గత వారం మన సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. దేశీయ స్థూల గణాంకాలు, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపాయి. అమెరికా రుణ పరిమితి పెంపుపై అనిశ్చితి, పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల గత వారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దేశీయంగా చూస్తే.. ఏప్రిల్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.6 శాతానికి తగ్గడం, టోకు ద్రవ్యోల్బణం -0.9 శాతంగా నమోదవ్వడం సానుకూలంగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంపై అనిశ్చితి పెరగడంతో మార్కెట్‌లో ఒడుదొడుకులు కనిపించాయి. రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవుతుందనే సమాచారమూ ఆందోళన కలిగించింది. బ్యారెల్‌ ముడిచమురు 1.6 శాతం లాభంతో 75.6 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.16 నుంచి 82.66కు బలహీనపడింది. అంతర్జాతీయంగా.. జపాన్‌ ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 1.6% వృద్ధి చెందగా, ఏప్రిల్‌ ద్రవ్యోల్బణం మాత్రం లక్ష్యిత 2% కంటే ఎక్కువగా 3.4 శాతానికి చేరింది. చైనా పారిశ్రామికోత్పత్తి ఏప్రిల్‌లో లక్ష్యిత 10 శాతానికి దూరంగా 5.6 శాతం వద్ద ఆగింది. అమెరికా రుణ పరిమితి పెంపు వార్తలు కీలకంగా మారాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.5 శాతం నష్టంతో 61,730 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.6 శాతం తగ్గి 18,203 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో ఐటీ, బ్యాంకింగ్‌, స్థిరాస్తి లాభపడగా.. విద్యుత్‌, చమురు-గ్యాస్‌, మన్నికైన వినిమయ వస్తువులు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.4,098 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.677 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐ) నికరంగా రూ.30,945 కోట్ల    పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:5గా నమోదు కావడం..
ఎంపిక చేసిన షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: సెన్సెక్స్‌ కీలక నిరోధమైన 62,000 స్థాయి పైన స్థిరపడటంలో విఫలమైంది. తక్షణ మద్దతు స్థాయి అయిన 61,000 పాయింట్ల దరిదాపుల్లో ట్రేడవుతోంది. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే స్వల్పకాలంలో స్థిరీకరణ చోటు చేసుకోవచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలు ప్రభావం చూపుతాయి. నెలవారీ ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల గడువు ముగియనున్నందున, ప్రధాన సూచీల్లోని అధిక వెయిటేజీ ఉన్న రంగాల్లో షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవచ్చు. రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియనూ మార్కెట్లు సునిశితంగా పరిశీలించొచ్చు. కార్పొరేట్‌ వార్తలు, ఫలితాల నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత కదలికలు చోటు చేసుకోవచ్చు. నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపుతాయి. ఈ వారం సన్‌ఫార్మా, హిందాల్కో, ఎల్‌ఐసీ, నైకా, బయోకాన్‌, ఫోర్టిస్‌ వంటి కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా రుణ పరిమితి ఒప్పందంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనే దానిపై ఆధారపడి, సమీప కాలంలో మార్కెట్లు కదలాడొచ్చు. చైనా ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడంతో పాటు యూరో ఏరియా వినియోగదారు విశ్వాసం, యూకే, యూఎస్‌ తయారీ పీఎంఐ, యూకే ఏప్రిల్‌ ద్రవ్యోల్బణం, యూఎస్‌ ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ వంటివీ ప్రభావం చూపొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ కొనుగోళ్ల నుంచి మార్కెట్లు సంకేతాలు తీసుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 61,000, 60,500, 59,412
తక్షణ నిరోధ స్థాయులు: 62,000, 62,625, 63,000
సెన్సెక్స్‌ 61,000 పాయింట్ల దిగువన స్థిరీకరించుకోవచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని