గుర్తింపు కార్డు సమర్పించక్కర్లేదు.. ఏ పత్రమూ నింపొద్దు

చలామణి నుంచి ఉపసంహరించిన రూ.2,000 నోట్లను తడవకు రూ.20 వేల విలువ వరకు ఎలాంటి పత్రాలు నింపకుండా, గుర్తింపు కార్డులు చూపకుండా నేరుగా బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకోవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది.

Updated : 22 May 2023 09:29 IST

రూ. 2,000 నోట్ల మార్పిడిపై ఎస్‌బీఐ స్పష్టీకరణ
ఒక విడతలో పది నోట్లు మార్చుకోవచ్చు
రేపటి నుంచే ప్రక్రియ 

ఈనాడు, దిల్లీ/వాణిజ్య విభాగం: చలామణి నుంచి ఉపసంహరించిన రూ.2,000 నోట్లను తడవకు రూ.20 వేల విలువ వరకు ఎలాంటి పత్రాలు నింపకుండా, గుర్తింపు కార్డులు చూపకుండా నేరుగా బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకోవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. ఈ మేరకు వివరాలు తెలుపుతూ, అన్ని సర్కిళ్ల చీఫ్‌ జనరల్‌ మేనేజర్లకు సమాచారం ఇచ్చింది. ప్రజలు ఎవరైనా రూ.2,000 నోట్లను 10 వరకు తెచ్చుకుని, ఇతర నోట్లకు మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. నోట్లు మార్చుకునే సమయంలో ఎలాంటి గుర్తింపుకార్డు సమర్పించాల్సిన అవసరం లేదనీ తెలిపింది. రూ.2,000 నోట్ల మార్పిడికి ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30 వరకు అనుమతి ఇస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో నిబంధనలకు లోబడి ప్రజలకు సహకరించాలని, ఎలాంటి అసౌకర్యం లేకుండా రూ.2,000 నోట్ల మార్పిడి కార్యక్రమం సజావుగా నిర్వహించాలని సిబ్బందికి సూచించింది.

* ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా రూ.2,000 నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే ఒక  లావాదేవీలో 10 నోట్లకు మించి మార్చుకునే వీలుండదు.

* రూ.2,000 నోట్లను బ్యాంక్‌ ఖాతాలో జమ చేసుకునేందుకు గరిష్ఠ పరిమితిని ఆర్‌బీఐ తెలుపలేదు. అయితే తమకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో, ఇతర శాఖల్లో కేవైసీ, ఇతర నిబంధనల ప్రకారం.. ఎంతమేర గరిష్ఠంగా నగదు జమ చేసేందుకు అనుమతి ఉంటే, అంత విలువ వరకు రూ.2000 నోట్లను ఖాతాలో వేసుకోవచ్చని చెబుతున్నారు.

* 2016 నవంబరులో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినందున, ఆ నోట్లు పనికి రాకుండా పోయాయి. అయితే ఇప్పుడు రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నారే గానీ, వీటి చెల్లుబాటు (లీగల్‌ టెండర్‌) కొనసాగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. అందువల్ల ప్రజలు తమ లావాదేవీలకు ఈ నోట్లను సెప్టెంబరు వరకు ఉపయోగించుకోవచ్చు.


బంగారం కొనుగోలుకు ఆసక్తి

రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు శుక్రవారం ఆర్‌బీఐ ప్రకటించినప్పటి నుంచీ, వాటిని కలిగి ఉన్నవారు సాధ్యమైనంత త్వరగా ఖర్చుపెట్టాలని/ బ్యాంకుల్లో మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. శనివారమే బ్యాంకు శాఖలకు వెళ్లి, మార్చుకునేందుకు ప్రయత్నించగా, మంగళవారం నుంచి రమ్మని చెప్పి తిప్పి పంపినట్లు సమాచారం. పలువురు బంగారు ఆభరణాల దుకాణాలకు వెళ్లి రూ.2,000 నోట్లతో కొనుగోలుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే అత్యధికులు మాత్రం ఎంతమేరకు నగదుతో కొనుగోలు చేయొచ్చో ఆరా తీస్తున్నట్లు సమాచారం.

నగదు చెల్లింపులకు పరిమితులున్నాయ్‌

ఆభరణాల దుకాణాల్లో రూ.50,000 వరకు నగదు చెల్లింపులకు గుర్తింపు కార్డులు ఏమీ సమర్పించనక్కర్లేదు. పేరు, ఫోన్‌ నంబరు ఇస్తే సరిపోతుంది. రూ.2 లక్షల వరకు కూడా నగదుతో చెల్లించొచ్చు. అయితే పాన్‌కార్డ్‌, ఆధార్‌ వంటి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నట్లు బులియన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని