రష్యాకు మందుల ఎగుమతులు పెంచుకుందాం!

రష్యా ఎన్నో ఏళ్లుగా మనకు మిత్ర దేశం. ప్రధానంగా రక్షణ భాగస్వామ్యానికే ఇది పరిమితమైంది. ద్వైపాక్షిక వాణిజ్యం పెద్దగా విస్తరించలేదు.

Updated : 23 May 2023 11:42 IST

తగిన మార్గాలు అన్వేషిస్తున్న ‘ఫార్మాగ్జిల్‌’  
వాణిజ్య లోటు తగ్గించేందుకు ప్రభుత్వ కసరత్తు
ఈనాడు - హైదరాబాద్‌

రష్యా ఎన్నో ఏళ్లుగా మనకు మిత్ర దేశం. ప్రధానంగా రక్షణ భాగస్వామ్యానికే ఇది పరిమితమైంది. ద్వైపాక్షిక వాణిజ్యం పెద్దగా విస్తరించలేదు. గత కొన్నేళ్లుగా ఇది 9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.74,000 కోట్ల) వద్ద ఉండిపోయింది. ఏటా మనదేశం దాదాపు 3.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.29,000 కోట్ల) విలువైన వస్తువులను రష్యాకు ఎగుమతి చేస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి 5- 5.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.41,000-45,000 కోట్ల) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. మన ఎగుమతుల కంటే దిగుమతుల బిల్లు భారం (వాణిజ్యలోటు) సుమారు రూ.16,000 కోట్ల వరకే అధికంగా ఉండేది. ఈ గణాంకాలను పరిశీలిస్తే ద్వైపాక్షిక వాణిజ్యం, వాణిజ్య లోటు.. రెండూ తక్కువగానే ఉన్నాయి.


యుద్ధంతో అంతా మారింది

గతేడాది నుంచి రష్యాతో వాణిజ్యం అనూహ్యంగా విస్తరించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ మార్పునకు ప్రధాన కారణం. ఈ యుద్ధం నేపథ్యంలో, రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పటినుంచి అంతర్జాతీయ ధర కంటే తక్కువకే ముడిచమురును రష్యా మనదేశానికి విక్రయిస్తోంది. ఫలితంగా మనదేశం రష్యా నుంచి పెద్దఎత్తున ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇదంతా ఏకపక్షమే. రష్యా నుంచి మన దేశంలోకి దిగుమతులు పెరిగాయి కానీ, మనదేశం నుంచి రష్యాకు ఎగుమతులు పెరగలేదు. దీంతో వాణిజ్య లోటు విస్తరించింది. 2022-23 ఆర్థిక సంవత్సరాన్నే తీసుకుంటే, రెండు దేశాల మధ్య వాణిజ్యం 39.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.26 లక్షల కోట్ల)కు పెరిగింది. అందులో మన ఎగుమతులు 4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.33,000 కోట్ల)కు మించి ఉండవు. మిగతా అంతా రష్యా నుంచి దిగుమతులే. అందులోనూ దాదాపు 30 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.46 లక్షల కోట్ల) మేరకు చమురు దిగుమతులే ఉంటాయి. వాణిజ్య లోటు ఇంత భారీగా పెరగడంతో, దీన్ని అదుపు చేయడం ఎలా.. అనే అంశంపై కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ దృష్టి సారించింది. తగిన ప్రత్యామ్నాయాలను అన్వేషించేందుకు కసరత్తు ప్రారంభించింది. రష్యాకు మందుల ఎగుమతులను పెంచుకోవాలని భావిస్తూ, తగిన మార్గాలు వెతకాల్సిందిగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మాగ్జిల్‌ (ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) ను కోరింది.


ఔషధాలే ఎందుకు?

రష్యా నుంచి మనదేశం ఇటీవల వరకు ఆయుధ సామగ్రి, ఎరువులు, రసాయనాలు, లోహాలు, ఖనిజాలు దిగుమతి చేసుకునేది. ఇప్పుడు వీటన్నింటినీ ముడి చమురు మించింది. మనదేశం, రష్యాకు మందులు, దుస్తులు, యంత్ర విడిభాగాలు, ఇతర వస్తువులు ఎగుమతి చేస్తోంది. రష్యాకు మనదేశం చేసే ఎగుమతుల్లో మందుల వాటా 10% వరకు ఉంటోంది. సోవియట్‌ యూనియన్‌గా ఉన్నప్పటి నుంచీ, రష్యాకు మనదేశం ఔషధాలను ఎగుమతి చేస్తోంది.  డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సన్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, టోరెంట్‌ ఫార్మా వంటి దిగ్గజ కంపెనీలు ఎన్నో ఏళ్లుగా రష్యాకు మందులు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మనదేశం ఎగుమతులు పెంచుకునే అవకాశం ఏదైనా ఉంటే, అది మందుల విభాగంలోనే అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్లే ఈ అంశాన్ని అధ్యయనం చేసి, తగిన ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఫార్మాగ్జిల్‌ను కోరింది. దీనిపై పరిశీలన చేస్తున్నామని, త్వరలో ప్రణాళిక సిద్ధమవుతుందని ఫార్మాగ్జిల్‌ వర్గాలు ‘ఈనాడు’ కు వివరించాయి.


ఇతర వస్తువులు కూడా..

ఇతర వస్తువుల ఎగుమతులను ఏమేరకు పెంచుకోగలమనే విషయాన్నీ కేంద్ర వాణిజ్య శాఖ పరిశీలిస్తోంది. దీనిపై దేశంలోని వివిధ ఎగుమతుల ప్రోత్సాహక మండళ్లను ఇప్పటికే సంప్రదించింది. ఎక్కడెక్కడ ఎగుమతులు పెంచుకోవచ్చో చూడమని కోరింది. ఎలక్ట్రానిక్స్‌, వాహన విడిభాగాలు, తయారు చేసిన వస్తువులు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతులూ పెంచుకునే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల కొంతమేరకైనా రష్యాతో వాణిజ్య లోటును తగ్గించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని