ఆ 21 దేశాల పెట్టుబడులకు ఏంజెల్‌ ట్యాక్స్‌ వర్తించదు

నమోదుకాని దేశీయ అంకుర సంస్థల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి, ఏంజెల్‌ ట్యాక్స్‌ మినహాయింపును ఇస్తూ 21 దేశాలను ఆర్థిక శాఖ నోటిఫై చేసింది.

Published : 26 May 2023 00:59 IST

నోటిఫై చేసిన ఆర్థిక శాఖ

దిల్లీ: నమోదుకాని దేశీయ అంకుర సంస్థల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి, ఏంజెల్‌ ట్యాక్స్‌ మినహాయింపును ఇస్తూ 21 దేశాలను ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ దేశాల నుంచి అంకురాల్లోకి వచ్చే పెట్టుబడులకు ఏంజెల్‌ ట్యాక్స్‌ వర్తించదు. వీటిల్లో సింగపూర్‌, నెదర్లాండ్స్‌, మారిషస్‌ పేర్లు లేవు.

ఇవీ 21 దేశాలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న 21 దేశాల జాబితాలో బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఆస్ట్రియా, కెనడా, చెక్‌ రిపబ్లిక్‌, బెల్జియం, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఇజ్రాయిల్‌, ఇటలీ, ఐస్‌లాండ్‌, జపాన్‌, కొరియా, రష్యా, నార్వే, న్యూజిలాండ్‌, స్వీడన్‌ ఉన్నాయి.

ఇదీ నేపథ్యం: డీపీఐఐటీ (పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం) గుర్తింపు ఉన్న అంకురాలు మినహా, నమోదుకాని కంపెనీల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులను ఏంజెల్‌ ట్యాక్స్‌ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. అయితే కొన్ని రకాల విదేశీ పెట్టుబడుల విషయంలో, పన్ను నుంచి మినహాయింపులు ఇవ్వాలంటూ అంకురాలు, వెంచర్‌ కేపిటల్‌ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరాయి. ఇందులో భాగంగా ఏంజెల్‌ ట్యాక్స్‌ పరిధి కిందకు రాని పెట్టుబడిదార్లను ఈనెల 24న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేసింది. ఏంజెల్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయించిన వాటిల్లో ఈ 21 దేశాలకు చెంది, సెబీ వద్ద కేటగిరి-1 కింద నమోదైన ఎఫ్‌పీఐలు, ఎండోమెంట్‌ ఫండ్‌లు, పింఛన్‌ ఫండ్‌లు, పూల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వెహికల్స్‌ ఉన్నాయని నోటిఫికేషన్‌ ప్రకారం తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. పటిష్ఠ నియంత్రణ నిబంధనలు ఉన్న దేశాల నుంచే మరింతగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంలో మన ప్రభుత్వం ఉన్నట్లుగా ఈ జాబితాను చూస్తే అర్థమవుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై పూర్తి స్థాయి మార్గదర్శకాలను త్వరలోనే సీబీడీటీ విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ మార్కెట్‌ విలువకు పైబడి సమీకరించే పెట్టుబడుల మీద విధించే పన్నును ఏంజెల్‌ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు