9 ఏళ్లు.. రూ.197 లక్షల కోట్లు

దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో పెద్ద నోట్ల రద్దు, కొవిడ్‌-19 సంక్షోభం వంటి అవాంతరాలు ఎదురైనా.. పరోక్ష పన్నులన్నింటినీ ఒకటిగా చేసి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి తేవడం, తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకాలను అమలు చేయడం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు తీసుకున్న చర్యల వల్ల స్టాక్‌ మార్కెట్ మదుపర్లకు మాత్రం లాభాల పంట పండింది.

Updated : 27 May 2023 03:04 IST

మోదీ హయాంలో పెరిగిన బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ

2014 మే 26   సెన్సెక్స్‌ 24,716.88  నిఫ్టీ  7359.05
బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ: రూ.85.21 లక్షల కోట్లు

2023 మే 26 సెన్సెక్స్‌ 62,501.69 నిఫ్టీ 18,499.35
బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ: రూ.282.67 లక్షల కోట్లు

దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో పెద్ద నోట్ల రద్దు, కొవిడ్‌-19 సంక్షోభం వంటి అవాంతరాలు ఎదురైనా.. పరోక్ష పన్నులన్నింటినీ ఒకటిగా చేసి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి తేవడం, తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకాలను అమలు చేయడం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు తీసుకున్న చర్యల వల్ల స్టాక్‌ మార్కెట్ మదుపర్లకు మాత్రం లాభాల పంట పండింది. గత 9 ఏళ్లలో సెన్సెక్స్‌, నిఫ్టీ 150 శాతానికి పైగా దూసుకెళ్లాయి. బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ 2014 మే నుంచి ఇప్పటివరకు  రూ.197 లక్షల కోట్లకు మించి పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే సానుకూల వర్షపాత అంచనాలకు తోడు ఇతర అంశాల మద్దతుతో, సూచీలు దూసుకెళ్లడంతో మదుపర్ల సంపద రూ.2.34 లక్షల కోట్లు పెరిగింది.

2014 మే నుంచి 2023 మే మధ్య భారత ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) 49.21 బి.డాలర్ల (దాదాపు రూ.4 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టారు. ఈ 9 ఏళ్లలో కేవలం రెండేళ్లలోనే వారు నికర విక్రేతలుగా నిలిచారు. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.7 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడం గమనార్హం. 2020 నుంచి కొవిడ్‌ రూపంలో సవాళ్లు ఎదురైనా.. స్టాక్‌మార్కెట్లోకి రిటైల్‌ మదుపర్లు భారీగా ప్రవేశించేందుకు ఈ సమయమే కారణమైంది. ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనదేశం నిలవడంతో, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానం అవుతోంది.

* 2027 కల్లా జపాన్‌, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని.. 2030 కల్లా మూడో అతిపెద్ద స్టాక్‌మార్కెట్‌గా ఉంటుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. భారత జీడీపీ ప్రస్తుత 3.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.287 లక్షల కోట్ల) స్థాయి నుంచి 2031కి 7.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.615 లక్షల కోట్ల)కు చేరుతుందనే అంచనానూ ఆ సంస్థ వ్యక్తం చేసింది.

* అయిదేళ్లలో సెన్సెక్స్‌ 1,00,000 పాయింట్లకు చేరుతుందనే అంచనాను అమెరికాకు చెందిన జెఫ్రీస్‌ ఈక్విటీ విభాగాధిపతి క్రిస్‌ వుడ్‌ అంచనా వేశారు.

* మోదీ హయాంలో నిఫ్టీ ఐటీ సూచీ అత్యధికంగా 219% దూసుకెళ్లింది. కొవిడ్‌ పరిణామాల్లో అన్ని రంగాలు డిజిటల్‌కు మారడం వల్ల ఐటీ కంపెనీలకు భారీగా ప్రాజెక్టులు రావడమే ఇందుకు కారణం

ఉరకలేసిన ఉత్సాహం

మదుపర్ల కొనుగోళ్ల జోరుతో రెండో రోజూ సూచీలు లాభాలను నమోదుచేశాయి. రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌ వంటి పెద్ద షేర్లు దుమ్మురేపడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కలిసొచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలపడి 82.60 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.24% పెరిగి 76.44 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* కొనుగోళ్ల మద్దతుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దుమ్మురేపింది. 2.79% లాభపడిన షేరు రూ.2,506.55 వద్ద ముగిసింది. మార్కెట్‌ విలువ రూ.45,887.8 కోట్లు పెరిగి రూ.16.95 లక్షల కోట్లకు చేరింది.  సానుకూల ఆర్థిక ఫలితాల ప్రభావంతో సన్‌ఫార్మా షేరు 2.75% పెరిగి రూ.970.65 దగ్గర స్థిరపడింది. జనవరి- మార్చిలో నష్టం తగ్గడంతో వొడాఫోన్‌ ఐడియా షేరు 1.14% పెరిగి రూ.7.07 వద్ద ముగిసింది.

నేటి బోర్డు సమావేశాలు: అరబిందో ఫార్మా, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, ఆర్‌కామ్‌, పీఎఫ్‌సీ, పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని