భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఈ ఏడాది భారత్‌ అధిక వృద్ధిని సాధిస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు బార్జ్‌ బ్రెండ్‌ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ‘ప్రఖ్యాత స్నోబాల్‌ ఎఫెక్ట్‌’ కనిపిస్తున్నందున మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు.

Published : 27 May 2023 02:05 IST

భవిష్యత్‌లో ఇక్కడే అధిక వృద్ధి
మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలకు వీలు
అంతర్జాతీయ వృద్ధిపై అంతగా ఆశల్లేవు
ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బార్జ్‌ బ్రెండ్‌

దిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఈ ఏడాది భారత్‌ అధిక వృద్ధిని సాధిస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు బార్జ్‌ బ్రెండ్‌ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ‘ప్రఖ్యాత స్నోబాల్‌ ఎఫెక్ట్‌’ కనిపిస్తున్నందున మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు. ‘ఒక మంచు బంతి పర్వతం పైనుంచి కిందకు దొర్లే సమయంలో, మంచును జతచేసుకుంటూ పెద్ద బంతిగా మారుతుంది. అలాగే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సంస్కరణల ప్రభావం వల్ల వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతుంది. దీన్నే స్నోబాల్‌ ఎఫెక్ట్‌’గా అభివర్ణిస్తుంటారు. ‘భారత్‌లో చేపట్టిన సంస్కరణల వల్ల నిబంధనల భారం తగ్గింది. పెట్టుబడులకు మంచి వాతావరణం ఏర్పడింది. డిజిటల్‌ విప్లవమూ భారత్‌లో కనిపిస్తోంది. అందువల్ల భవిష్యత్‌లో భారత వృద్ధిపై చాలా ఆశావహంగా ఉన్నాం. అయితే అంతర్జాతీయ వృద్ధిపై మాత్రం ఈ ఆశలు లేవు’ అని ఆయన అన్నారు. ‘ఒక మంచు బంతి దొర్లుతున్నపడు అది మరింత పెద్దగా మారుతుంటుంది. భారత ఆర్థిక వ్యవస్థలో అదే జరగుతోంది. వృద్ధి కారణంగా మరిన్ని పెట్టుబడులు.. ఉద్యోగాలు వస్తాయి. దీని వల్ల వచ్చే కొన్నేళ్లలో మరింత వృద్ధి కనిపిస్తుంది. పేదరిక నిర్మూలన జరుగుతుంది. యువకులకు మరిన్ని అవకాశాలు వస్తాయ’ని  పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

అంకుర వ్యవస్థ స్ఫూర్తినిస్తోంది: ‘భారత్‌ను చూసి అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా నేర్చుకోవాలి. ఏ ఇతర వర్థమాన దేశంలో లేనంత అంకుర వ్యవస్థ భారత్‌లో ఉంది. అది వృద్ధి చెందుతూనే ఉంది. ఇతర దేశాలు దీన్నుంచి స్ఫూర్తి పొందాల’ని ఆయన అన్నారు. భారత జి20 ప్రెసిడెన్సీ సందర్భంగా, ప్రస్తుత భాగస్వామ్యాలపై చర్చల కోసం ఆయన భారత్‌కు వచ్చారు. ‘ఇప్పటికే సంస్కరణల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఈ స్ఫూర్తి కొనసాగాలి. మౌలికం, విద్య, నైపుణ్యంపై మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాలు ఉద్దీపనపై మరీ ఎక్కువ ఖర్చుపెట్టడంతో ఇపుడు ఖర్చుపెట్టడానికి ఏమీ లేదు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్‌ ఉద్దీపనలిచ్చినా.. అప్పుల్లో చిక్కుకోలేద’ని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని