ప్రాథమిక రసాయనాలకూ పీఎల్‌ఐ పథకం

ప్రపంచ విపణుల్లో పోటీ పడేందుకు, చౌక ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడంపై దేశీయ ఔషధ, వైద్య పరికరాల పరిశ్రమ దృష్టి సారించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సూచించారు.

Updated : 27 May 2023 06:35 IST

చౌకగా నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయాలి
ఔషధ, వైద్య పరికరాల పరిశ్రమకు మంత్రి మాండవీయ సూచన

దిల్లీ: ప్రపంచ విపణుల్లో పోటీ పడేందుకు, చౌక ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడంపై దేశీయ ఔషధ, వైద్య పరికరాల పరిశ్రమ దృష్టి సారించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సూచించారు. ప్రాథమిక రసాయనాలను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కిందకు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఔషధ, వైద్య పరికరాల రంగంపై ఓ అంతర్జాతీయ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. పేదలు, రైతులతో పాటు పరిశ్రమకూ అనుకూల ప్రభుత్వం తమదని చెప్పారు. విధానాలన్నింటినీ పరిశ్రమ, ఇతర వాటాదార్లతో విస్తృత సంప్రదింపులు జరిపాకే రూపొందిస్తున్నామని తెలిపారు. భారత్‌ను ప్రపంచానికి ఔషధ కేంద్రంగా మంత్రి అభివర్ణిస్తూ.. పరిశోధనలు, ఆవిష్కరణలపై పరిశ్రమ దృష్టి సారించాలని సూచించారు. అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. ప్రపంచ విపణుల్లో పోటీ పడేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ‘చౌక ధరలు, నాణ్యతపరంగా మనకున్న ప్రతిష్ఠను మరింతగా పెంచుకోవాలి. నాణ్యత విషయంలో రాజీ పడినా, అలక్ష్యం వహించినా ప్రపంచవ్యాప్తంగా మనకున్న పేరు దెబ్బతింటుంది. పోటీ సామర్థ్యమూ క్షీణిస్తుంది. దీనిని ఏమాత్రం ఉపేక్షించబోమ’ని మంత్రి తెలిపారు. పరిశ్రమపై ఎటువంటి కఠిన చర్యలు చేపట్టే పరిస్థితి రాదనే అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఔషధ, వైద్య పరికరాల రంగాల్లో నాణ్యమైన ఉత్పత్తుల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు పరిశ్రమ సహకారం అందించాలని వివరించారు. దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఈ రంగాలను పీఎల్‌ఐ-1, పీఎల్‌ఐ-2 పథకాల కిందకు తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. పరిశ్రమ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రానున్న రోజుల్లో ప్రాథమిక రసాయనాలకు కూడా పీఎల్‌ఐ పథకాన్ని వర్తింపజేస్తామని వివరించారు. వ్యవసాయ రసాయనాలు, పెట్రో రసాయనాలు, ఫార్మా ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రేడియంట్స్‌) పరిశ్రమలకు చాలా ప్రాథమిక రసాయనాలు అవసరమని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు