50 తగ్గిన సెయిల్‌ లాభం

ప్రభుత్వరంగ ఉక్కు దిగ్గజం సెయిల్‌, మార్చి త్రైమాసికంలో రూ.1159.21 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2478.82 కోట్ల కంటే ఇది 50% కంటే తక్కువ.

Published : 27 May 2023 02:03 IST

దిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు దిగ్గజం సెయిల్‌, మార్చి త్రైమాసికంలో రూ.1159.21 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2478.82 కోట్ల కంటే ఇది 50% కంటే తక్కువ. ఆదాయం తగ్గడమే ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.31,175.25 కోట్ల నుంచి రూ.29,416.39 కోట్లకు తగ్గింది. ముడి ఉక్కు తయారీ 4.60 మిలియన్‌ టన్నుల నుంచి 4.95 మిలియన్‌ టన్నులకు పెరిగిందని సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో అమ్మకాలు 4.71 మిలియన్‌ టన్నుల నుంచి 4.68 మిలియన్‌ టన్నులకు తగ్గాయని పేర్కొంది. ‘బొగ్గు ధర అధికంగా ఉండటం, ఉక్కు ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం వల్లే సంస్థ లాభదాయకతపై ప్రభావం పడింద’ని కంపెనీ వివరించింది. ప్రతి షేరుకు రూ.0.50 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది.


అమెరికాకు అరబిందో ఫార్మా ఔషధం

ఈనాడు, హైదరాబాద్‌: అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా అమెరికాలో కార్బోప్రాస్ట్‌ ట్రోమెథమైన్‌ ఇంజక్షన్‌ 250 ఎంజీ/ ఎంఎల్‌ సింగిల్‌ డోస్‌ వయల్‌ను విక్రయించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి పొందింది. ఈ మందును పోస్ట్‌పార్టమ్‌ హెమరేజ్‌ (పీపీహెచ్‌) ను అదుపుచేయడానికి వినియోగిస్తున్నారు. అరబిందో తీసుకువచ్చిన ఇంజెక్షన్‌, ఫైజర్‌కు చెందిన హెమబేట్‌ ఇంజెక్షన్‌కు బయోఈక్విలెంట్‌ ఔషధం. ఈ ఏడాది జూన్‌లో ఈ మందును అమెరికాలో విడుదల చేయనున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది.


బీఎల్‌ కాశ్యప్‌కు ఐఎస్‌బీ నుంచి రూ.132 కోట్ల కాంట్రాక్టు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), రూ.132 కోట్ల భవన నిర్మాణ కాంట్రాక్టును బెంగళూరుకు చెందిన బీఎల్‌ కాశ్యప్‌ అండ్‌ సన్స్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ కాంట్రాక్టు ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఎస్‌బీకి సేవలు అందించే అవకాశం తమకు లభించిందని బీఎల్‌ కాశ్యప్‌ అండ్‌ సన్స్‌ ఎండీ వినీత్‌ కాశ్యప్‌ వివరించారు. ఈ సంస్థ చేతిలో ప్రస్తుతం రూ.2,650 కోట్ల విలువైన ఆర్డర్లున్నాయి.


బీఓఐ ఎఫ్‌డీ రేట్లు పెరిగాయ్‌

దిల్లీ: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బీఓఐ) ప్రకటించింది. ఏడాది కాల వ్యవధి గల రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై రిటైల్‌ వినియోగదార్లకు 7% వడ్డీ చెల్లించనుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.5 శాతం; సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు (80 ఏళ్ల పైబడిన) 7.65% వడ్డీ రేటు అందిస్తున్నట్లు తెలిపింది. తాజా సవరణలతో 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలావధులపై డిపాజిట్‌ రేటు 3 - 7%  ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని