రెండేళ్లలో అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్‌!

వచ్చే రెండేళ్లలో భారత్‌ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్‌ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలతో దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎంతగానో మారిందని తెలిపారు.

Published : 28 May 2023 01:39 IST

ఆరేళ్లలో మూడో స్థానానికి..
కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

దిల్లీ: వచ్చే రెండేళ్లలో భారత్‌ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్‌ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలతో దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎంతగానో మారిందని తెలిపారు. మోదీ సర్కారు 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచానికి భారత్‌ ప్రస్తుతం ఒక ఆశాదీపంగా కనిపిస్తోంది. ప్రపంచం మొత్తం భారత్‌పై ఎంతో విశ్వాసంతో ఉంది. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. తద్వారా 2047 నాటికి దేశం సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. అప్పటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ పరంగా పదో స్థానంలో ఉన్న మన దేశం ప్రస్తుతం అయిదో స్థానానికి చేరింది. వచ్చే రెండేళ్లలో నాలుగో స్థానానికి, ఆరేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటుంద’ని ఆశాభావం వ్యక్తం చేశారు.

* కొవిడ్‌ కాలంలో సమయానికి టీకాల పంపిణీ మొదలుకొని సురక్షిత తాగునీరు అందించడం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద అందుబాటు ధరలో ఇళ్లు ఇవ్వడం, రైలు, విమాన, రహదారి మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి నాణ్యమైన, నిజమైన మార్పును దేశంలో తీసుకొచ్చాయని మంత్రి వివరించారు. పీఎం ఆవాస్‌ యోజన కింద 3.5 కోట్ల ఇళ్లు నిర్మించారన్నారు. 12 కోట్ల మందికి నీటి కనెక్షన్లు, 9.6 కోట్ల కుటుంబాలకు గ్యాస్‌ సిలిండర్లు అందించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ బీమా కార్యక్రమం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను తీసుకొచ్చినట్లు తెలిపారు. దీని కింద రూ.5 లక్షల వరకు కవరేజీ అందిస్తున్నట్లు తెలిపారు. అమెరికా, రష్యా జనాభాను కలిపినా అంతకంటే ఎక్కువ మందిని ఈ పథకంలో చేర్చినట్లు వెల్లడించారు. డిజిటల్‌ విప్లవం పేదవారికి కూడా కొత్త అవకాశాలు కల్పిస్తోందన్నారు.

2027 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు.. సునీల్‌ మిత్తల్‌: 2027 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.410 లక్షల కోట్లు)కు చేరే అవకాశం ఉందని భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ వెల్లడించారు. గత 5 ఏళ్లలో దేశం సాధిస్తున్న అభివృద్ధిని వ్యక్తిగతంగా గమనిస్తున్నానని పేర్కొన్నారు. 2024 నాటికి దేశ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రపంచంలోనే అతి వేగంగా సాంకేతికత వైపు అడుగులు వేస్తున్న దేశంగా భారత్‌ నిలుస్తోందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని