మదుపర్ల ఫిర్యాదుల వ్యవస్థ మరింత బలోపేతం

మదుపర్ల ఫిర్యాదులను స్వీకరించి, వాటిని స్కోర్స్‌ వ్యవస్థ ద్వారా పరిష్కరించే ప్రక్రియను బలోపేతం చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ చర్యలు తీసుకుంటోంది.

Published : 28 May 2023 01:40 IST

ఆ దిశగా సెబీ చర్యలు
దిల్లీ

దుపర్ల ఫిర్యాదులను స్వీకరించి, వాటిని స్కోర్స్‌ వ్యవస్థ ద్వారా పరిష్కరించే ప్రక్రియను బలోపేతం చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఈ వ్యవస్థను ఆన్‌లైన్‌ వివాద పరిష్కార వ్యవస్థతో మిళితం చేయాలనే ప్రతిపాదన సిద్ధం చేసింది. ఎండ్‌-టు-ఎండ్‌ పరిష్కారాన్ని అందించడం ద్వారా సెక్యూరిటీల మార్కెట్‌లోని ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను సమగ్రంగా తీర్చిదిద్దాలనుకుంటోంది. ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని తగ్గించడం, ఆటో-రూటింగ్‌, ఆటో-ఎస్కలేషన్‌ను పరిచయం చేయడం ద్వారా ప్రక్రియను మరింత వేగవంతం, సమర్థంగా తీర్చిదిద్దడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం.

* సెబీ విడుదల చేసిన చర్చాపత్రం ప్రకారం, ప్రస్తుతం ఆటో-క్లోజ్‌లో ఉన్న లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ ధరల అవకతవకలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, అకౌంటింగ్‌ అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులను స్కోర్స్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి మినహాయించాలని, దీని కోసం ప్రత్యేకంగా మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ పోర్టల్‌ను రూపొందించాలని సూచించింది. ఒకవేళ మదుపర్లు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫిర్యాదులను స్కోర్స్‌లో నమోదు చేస్తే వాటిని అక్కడి నుంచి మార్కెట్‌ ఇంటెలిజిన్స్‌ పోర్టల్‌కు బదిలీ చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై జూన్‌ 3లోగా ప్రజలు స్పందనలు తెలియజేయాలని సెబీ కోరింది. స్కోర్స్‌ను 2011 జూన్‌లో ప్రారంభించారు. ఇందులో మదుపర్లు తమ ఫిర్యాదులను నమోదు చేసి వాటికి పరిష్కారాలను ట్రాక్‌ చేసుకొనే సదుపాయం ఉంది.

* వివరించలేని అనుమానాస్పద ట్రేడింగ్‌ విధానాలను ఎదుర్కోవడానికి సెబీ ప్రతిపాదించిన నియంత్రణ నిబంధనల ఫ్రేమ్‌వర్క్‌.. సంక్లిష్ట ఎంటిటీ నిర్మాణాలు, మ్యూల్‌ ఖాతాల వినియోగం, ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ వంటి వాటిని గుర్తించేందుకు సాయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్‌.. నేరస్థులను చట్టం పరిధిలోకి తీసుకురావడంలో ఒక ప్రధాన దశగా ఉంటుందని ఎస్‌ఏఎస్‌ ఆన్‌లైన్‌ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రేయ్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. అటువంటి అనైతిక పద్ధతుల నుంచి పెద్ద మొత్తంలో మదుపర్ల ప్రయోజనాలను రక్షించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఆనంద్‌రాఠీ వెల్త్‌ లిమిటెడ్‌ డిప్యూటీ సీఈఓ ఫిరోజ్‌ అజీజ్‌ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ దోహదపడుతుందని వెల్లడించారు.

* 2022లో 3,588 సంస్థలపై సెబీ అలర్ట్‌ జనరేషన్‌ మోడల్‌ ద్వారా సుమారు 5,000 అలర్ట్‌లు పంపించింది. ఇందులో 97 సంస్థలు 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు తిరిగి ఇందులో కనిపించాయి. అయితే వాటి ట్రేడింగ్‌ పాటర్న్‌పై కనెక్షన్లు/కమ్యూనికేషన్లను చూపించడంలో విఫలం కావడంతో వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. అందుకే కొత్త మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ పోర్టల్‌తో ఇలాంటి వాటికి అడ్డుకట్టవేయాలి సెబీ భావిస్తున్నట్లు నిపుణులు వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని