IT companies: ఆఫర్ లెటర్ ఇచ్చారు.. ఆఫర్ ఇవ్వడం లేదు!
‘ఉద్యోగానికి ఎంపిక చేశామంటూ ‘ఆఫర్ లెటర్’ చేతికి వచ్చి 6 నెలలు దాటింది.. ఇంకా ‘ఆఫర్’(నియామక పత్రం) మాత్రం ఇవ్వడం లేదు. అడిగితే, ఇదిగో..అదిగో.. అంటున్నారు’ అని పలువురు ఇంజినీరింగ్ పట్టభద్రులు వాపోతున్నారు.
ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థుల్లో ఆందోళన
వాయిదాలు వేస్తున్న ఐటీ సంస్థలు
మరి కొంతకాలం ఇంతేనా?
ఈనాడు - హైదరాబాద్
‘ఉద్యోగానికి ఎంపిక చేశామంటూ ‘ఆఫర్ లెటర్’ చేతికి వచ్చి 6 నెలలు దాటింది.. ఇంకా ‘ఆఫర్’(నియామక పత్రం) మాత్రం ఇవ్వడం లేదు. అడిగితే, ఇదిగో..అదిగో.. అంటున్నారు’ అని పలువురు ఇంజినీరింగ్ పట్టభద్రులు వాపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? ఇంకా ఎంత కాలం వేచిచూడాల్సి ఉంటుంది?
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో గతేడాది నుంచి ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సంగతి విదితమే. వేరే సంస్థల నుంచి వచ్చే అనుభవజ్ఞులతో పాటు కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసుకున్న తాజా ఉత్తీర్ణులనూ వెనువెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఐటీ ప్రాజెక్టులు లభిస్తే, దానికి సంబంధించిన అనుభవం కలిగిన వారికే ప్రాధాన్యమిస్తున్నాయి. సాధారణ నైపుణ్యాలు కలిగిన వారిపై, తాజా ఉత్తీర్ణులపై ఐటీ సంస్థలు అంతగా ఆసక్తి ప్రదర్శించడం లేదు.
అమెజాన్ ఇండియా కూడా
ఇప్పుడు అమెజాన్ ఇండియా కూడా ఇదే చేస్తోంది. ప్రాంగణాల్లో ఎంపిక చేసుకున్న విద్యార్థులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోరాదని ఈ సంస్థ భావిస్తోంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర అగ్రగామి ఇంజినీరింగ్ కళాశాలల్లో అమెజాన్ ఇండియా ప్రాంగణ ఎంపికలు నిర్వహించింది. ఎంపిక చేసుకున్న విద్యార్థులకూ ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ‘ఆర్థిక స్థితిగతులు బాగోలేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. కనీసం 6 నెలల పాటు అయినా జాప్యం తప్పదు. ఈ లోపు విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం’ అని అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఇటీవల అంతర్జాతీయంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అమెజాన్ తొలగించిన విషయం తెలిసిందే. ఉన్న వాళ్లనే తీసివేస్తుంటే, కొత్త ఉద్యోగులను తీసుకునే పరిస్థితి ఎక్కడ ఉంటుందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.
జియోమార్ట్‌లోనూ కోత: ఉద్యోగాలు తీసివేస్తున్న సంస్థల జాబితాలో ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియోమార్ట్ కూడా చేరింది. వెయ్యి మందికి పైగా అధికారులు, ఉద్యోగులను రాజీనామా చేయాలని జియోమార్ట్ ఆదేశించినట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం అవుతోంది. సరకు పంపిణీ కేంద్రాల్లో కొన్నింటిని జియోమార్ట్ మూసి వేస్తున్నందునే, ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. జర్మనీకి చెందిన టోకు విక్రయ సంస్థ మెట్రో క్యాష్ అండ్ క్యారీని జియోమార్ట్ సొంతం చేసుకున్నందున ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగినట్లు సమాచారం. ఇరు సంస్థల్లోని సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవడంలో భాగంగా కొంతమందిని తొలగించాల్సి వస్తోందని అంటున్నారు.
మెటాలో ఉన్నతోద్యోగులకు ఉద్వాసన
మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్‌బుక్) మన దేశంలోనూ ఉద్యోగులను తొలగిస్తోంది. దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని సంస్థ గత మార్చిలో ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే 4,000 మందికి ఉద్వాసన పలికినట్లు సమాచారం. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, కంటెంట్ మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ విభాగాల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిసింది. భారత్‌లో కొంతమంది ఉన్నతోద్యోగులనూ సంస్థ తొలగించిందని సమాచారం. మార్కెటింగ్ డైరెక్టర్, మీడియా భాగస్వామ్య డైరెక్టర్ స్థాయి వారు కూడా తొలగింపునకు గురయినట్లు చెబుతున్నారు. ఎంతో మంది తమ ఉద్యోగం పోయిందని, ఏదైనా ఆఫర్ ఉంటే చెప్పాలని కోరుతూ సోషల్ మీడియాలో అభ్యర్ధనలు పెడుతున్నారు.
ప్రత్యామ్నాయాల అన్వేషణ
ఉద్యోగాల్లో కోతతో పాటు కళాశాల ప్రాంగణాల్లో ఎంపికైన వారిని వెంటనే ఉద్యోగం లోకి తీసుకోకపోవడం అనేది కొంతకాలం తప్పదని ఐటీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా, ఐరోపాల్లో పరిస్థితులు కుదుట పడేవరకు ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు అధికంగా రావని.. ఆ మేరకు ఐటీ ఉద్యోగాలపై ఒత్తిడి ఉంటుందని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. ఉద్యోగానికి ఎప్పుడు పిలుస్తారో తెలియక, అప్పటి వరకూ ఏం చేయాలో అర్థంకాక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. విద్యారుణం తీసుకున్నవారు ప్రత్యా మ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. చిన్న ఉద్యోగం దొరికినా చేరిపోతున్నారు. మరికొందరు ఎంటెక్, ఎంబీఏ కోర్సుల్లో చేరుతున్నారు. కొందరు ఎంఎస్ కోర్సు కోసం ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..
-
Mansion 24 Trailer: ఆ భవంతిలోకి వెళ్లిన వారందరూ ఏమయ్యారు: ‘మాన్షన్ 24’ ట్రైలర్