చిప్‌ కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లోనూ చిప్‌ల కొరత వల్ల వాహన ఉత్పత్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) అంచనా వేస్తోంది.

Updated : 29 May 2023 03:43 IST

జులై-సెప్టెంబరు నుంచి ఉపశమనం: మారుతీ

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లోనూ చిప్‌ల కొరత వల్ల వాహన ఉత్పత్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) అంచనా వేస్తోంది. ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత ఇబ్బంది పెడుతోందని, జులై-సెప్టెంబరులో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (అమ్మకాలు, మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అప్పుడు కార్లను వేగంగా అందించగలమని వివరించారు. చిప్‌ల కొరత వల్లే, మార్కెట్‌ గిరాకీకి అనుగుణంగా కార్లను సంస్థ సరఫరా చేయలేకపోతోంది. ‘గత ఆర్థిక సంవత్సరంలో 1.7 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయాం. అక్టోబరు-డిసెంబరులోనే 45,000 కార్ల ఉత్పత్తి తగ్గింది. జనవరి-మార్చి త్రైమాసికంలో 38,000 కార్ల ఉత్పత్తి తగ్గింది’ అని శ్రీవాస్తవ వెల్లడించారు. సరఫరా కంటే గిరాకీ అధికంగా ఉండటంతో, కంపెనీ వద్ద పెండింగ్‌ ఆర్డర్లు దాదాపు 4 లక్షలకు చేరాయి. ఇందులో దాదాపు లక్ష బుకింగ్‌లతో ఎర్టిగా అగ్రస్థానంలో ఉంది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ బ్రెజాకు 60,000, జిమ్నీ, ఫ్రాంక్స్‌కు చెరో 30,000 ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి.
* 2022-23లో 20 లక్షల వాహనాలను తయారు చేయాలని మారుతీ లక్ష్యంగా పెట్టుకోగా, 19.22 లక్షలే చేయగలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని