యూపీఐ లావాదేవీలు.. రోజూ 100 కోట్లకు!

రోజువారీ చెల్లింపుల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్న యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) లావాదేవీలు మరింత పెరిగి, 2026-27 కల్లా రోజుకు 100 కోట్లకు చేరతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది.

Updated : 29 May 2023 09:40 IST

2026-27కు సాకారం
కార్డుల వ్యాపారంలో 76% వాటా క్రెడిట్‌కార్డులదే
పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక

దిల్లీ: రోజువారీ చెల్లింపుల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్న యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) లావాదేవీలు మరింత పెరిగి, 2026-27 కల్లా రోజుకు 100 కోట్లకు చేరతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. అప్పటికి రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో ఇవే 90% ఉంటాయని పేర్కొంది. 2022-23 రిటైల్‌ చెల్లింపు లావాదేవీల్లోనూ యూపీఐ వాటా 75 శాతమని ‘ది ఇండియన్‌ పేమెంట్స్‌ హ్యాండ్‌బుక్‌ 2022-27’ పేరిట విడుదల చేసిన నివేదికలో వివరించింది. ఈ నివేదిక ప్రకారం..

2022-23లో దేశీయంగా మొత్తం డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలు 10,300 కోట్ల మేర జరిగాయి. ఇవి 50% వార్షిక వృద్ధితో 2026-27కు 41,100 కోట్ల లావాదేవీలకు పెరిగే అవకాశం ఉంది. ఇందులో అత్యధికం యూపీఐ లావాదేవీలే.

2022-23లో యూపీఐ చెల్లింపుల లావాదేవీలు 8,371 కోట్ల మేర జరిగాయి. ఈ సంఖ్య 2026-27కు 37,900 కోట్లకు పెరగనుంది. అంటే రోజు వారీగా లావాదేవీల సంఖ్య సగటున 100 కోట్లకు మించనుంది.

క్రెడిట్‌కార్డు విభాగం కూడా వచ్చే అయిదేళ్లలో 21% వార్షిక వృద్ధిని సాధిస్తుందని నివేదిక అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్డుల ఆదాయంలో క్రెడిట్‌కార్డుల వాటాయే 76 శాతమని వెల్లడించింది. ఈ విభాగం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌లకు ఆకర్షణీయంగా ఉంది.

డెబిట్‌కార్డుల వినియోగం తగ్గిపోతోంది: రాబోయే అయిదేళ్లలో డెబిట్‌కార్డుల జారీలో వృద్ధి మందగించి, 3% వద్దే ఉండొచ్చు. డెబిట్‌కార్డులతో ఎక్కువగా నగదు ఉపసంహరించడంతో పాటు, చెల్లింపులు జరుపుతుంటారు. ఇప్పుడు యూపీఐతో మరింత సులభంగా, సురక్షితంగా నగదు చెల్లింపులు చేస్తున్నారు. ఏటీఎంలలో నగదు లభ్యత తగ్గడం, నగదు తీయాల్సిన అవసరమే లేకుండా మొబైల్‌తో చెల్లింపులు చేయగలగడం వల్లే డెబిట్‌ కార్డుల వినియోగం తగ్గుతోందని పేర్కొంది.

చెల్లింపుల ఆధారంగానే డిజిటల్‌ రుణాలు: భవిష్యత్తులో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ చెల్లింపుల లావాదేవీలను పరిశీలించే, డిజిటల్‌ రుణాల జారీ జరిగే అవకాశం ఉంది. మరిన్ని వినూత్న పద్ధతులతో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ మిహిర్‌ గాంధీ పేర్కొన్నారు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని