అపోలో హాస్పిటల్స్‌ లాభంలో 60% వృద్ధి

మార్చి 31, 2023తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఏకీకృత నికర లాభం 60 శాతం పెరిగి రూ.144 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల్లోనూ బలమైన పనితీరు కనిపించడం ఇందుకు దోహదం చేసింది.

Published : 31 May 2023 01:38 IST

రూ.9 తుది డివిడెండు

దిల్లీ: మార్చి 31, 2023తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఏకీకృత నికర లాభం 60 శాతం పెరిగి రూ.144 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల్లోనూ బలమైన పనితీరు కనిపించడం ఇందుకు దోహదం చేసింది. 2021-22 జనవరి-మార్చి త్రైమాసికంలో నికర లాభం రూ.90 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం సైతం రూ.3,546 కోట్ల నుంచి రూ.4,302 కోట్లకు పెరిగిందని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.

పూర్తి ఆర్థికానికి: మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం రూ.819 కోట్లకు చేరుకుంది. 2021-22లో నమోదైన రూ.1056 కోట్లతో పోలిస్తే ఇది తక్కువ. ఆదాయం మాత్రం 13 శాతం వృద్ధి చెంది రూ.16,612 కోట్లకు చేరింది. ‘ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో మా స్థిరమైన చిత్తం వల్లే ఆర్థిక అంశాల్లో, విస్తరణ పరంగా మా పనితీరు కొత్త శిఖరాలకు చేరింద’ని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి పేర్కొన్నారు. ‘భవిష్యత్తులోనూ రోబోటిక్స్‌తో పాటు అత్యుత్తమ సాంకేతికతపై పెట్టుబడులను కొనసాగిస్తాం. సర్జికల్‌ ప్రక్రియల రూపురేఖలను ఇది మారుస్తుంది. డిజిటల్‌ హెల్త్‌పైనా మా దృష్టి కొనసాగుతుంద’ని ఆయన పేర్కొన్నారు. 2022-23 ఏడాదికి ఒక్కో షేరుకు రూ.9 తుది డివిడెండును బోర్డు సిఫారసు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని