18,600 ఎగువకు నిఫ్టీ

విదేశీ కొనుగోళ్ల మద్దతుతో వరుసగా నాలుగో రోజూ సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌ 63,000 పాయింట్లకు చేరువ కాగా, నిఫ్టీ కీలకమైన 18,600 పాయింట్ల ఎగువన ముగిసింది.

Published : 31 May 2023 01:38 IST

సమీక్ష

విదేశీ కొనుగోళ్ల మద్దతుతో వరుసగా నాలుగో రోజూ సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌ 63,000 పాయింట్లకు చేరువ కాగా, నిఫ్టీ కీలకమైన 18,600 పాయింట్ల ఎగువన ముగిసింది. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, యంత్ర పరికరాల షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 82.67 వద్ద ముగిసింది.బ్యారెల్‌ ముడిచమురు 2.30% నష్టపోయి 75.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,839.85 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా స్వల్ప శ్రేణిలో కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 63,036.12 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 122.75 పాయింట్లు పెరిగి 62,969.13 వద్ద ముగిసింది. నిఫ్టీ    35.20 పాయింట్లు లాభపడి 18,633.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,575.50- 18,662.45 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 లాభపడ్డాయి. ఐటీసీ 2.31%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.08%, కోటక్‌ బ్యాంక్‌ 1.06%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.02%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.90%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.84% చొప్పున రాణించాయి. టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, నెస్లే, ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌ 1.27% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో ఆర్థిక సేవలు, సేవలు, టెక్‌, యంత్ర పరికరాలు, బ్యాంకింగ్‌, ఐటీ, పరిశ్రమలు మెరిశాయి. కమొడిటీస్‌, ఇంధన, టెలికాం, వాహన, లోహ, చమురు-గ్యాస్‌, స్థిరాస్తి నిరాశపరిచాయి. బీఎస్‌ఈలో 1631 షేర్లు లాభపడగా, 1874 స్క్రిప్‌లు నష్టపోయాయి. 109 షేర్లలో ఎటువంటి మార్పులేదు.

* 4 నెలల గరిష్ఠానికి పీ-నోట్ల పెట్టుబడులు: దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్లు) ద్వారా వచ్చిన పెట్టుబడులు 4 నెలల గరిష్ఠానికి చేరాయి. ఏప్రిల్‌ చివరకు ఇవి రూ.95,911 కోట్లకు పెరిగాయి. మార్చిలో ఇవి రూ.88,600 కోట్లుగా నమోదయ్యాయి. 2022 నవంబరు నాటి రూ.96,292 కోట్ల తరవాత ఏప్రిల్‌లోనే ఇవి గరిష్ఠ స్థాయికి చేరాయి.  

* డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ లక్ష్యం.. రూ.1300 కోట్ల టర్నోవర్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ 12% వృద్ధితో రూ.1300 కోట్లకు పైగా నమోదుకావొచ్చని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్‌.దివాకర్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు కంపెనీ కొత్త డ్రెడ్జింగ్‌ టెండర్లలో పాల్గొనేందుకు చూస్తోందని, కొత్త విపణుల్లో ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 2022-23లో కంపెనీ టర్నోవర్‌ రూ.1164 కోట్లుగా ఉందని, కంపెనీ ప్రారంభం నుంచి చూస్తే ఇదే అత్యధికమని తెలిపారు.

* సంక్షోభంలో కొనసాగుతున్న గోఫస్ట్‌, తన విమాన కార్యకలాపాల నిలిపివేతను జూన్‌ 4 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి, నగదును పూర్తిగా వాపసు ఇస్తామని సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని