40-50 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు అనుమతులింకా దక్కలేదు

మన దేశంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు సంబంధించిన దాదాపు 40-50 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఇంకా అనుమతులు దక్కలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Published : 01 Jun 2023 02:28 IST

మన సరిహద్దు దేశాలకు చెందినవే

దిల్లీ: మన దేశంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు సంబంధించిన దాదాపు 40-50 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఇంకా అనుమతులు దక్కలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ప్రెస్‌ నోట్‌-3’ కింద మన దేశంతో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకు కేంద్రప్రభుత్వ ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఆ దేశాల జాబితాలో చైనా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, భూటాన్‌, నేపాల్‌, మయన్మార్‌, ఆఫ్ఘనిస్థాన్‌ ఉన్నాయి. ‘ఈ దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలపై పూర్తి నిషేధం ఏమీ లేదు. కేవలం ప్రభుత్వ అనుమతుల మార్గంలోనే ఆయా దేశాల పెట్టుబడిదార్లు ఇక్కడకు రావాల్సి ఉంటుంది. ఈ అనుమతుల ప్రక్రియకు కొంత సమయం పట్టొచ్చ’ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీరి ప్రతిపాదనలకు 3 నెలల్లో అనుమతులు రావాల్సి ఉన్నా.. ఇప్పటికే 7 నెలలు అయింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. ఎమ్‌జీ మోటార్‌ (చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్ప్‌కు చెందిన బ్రిటిష్‌ బ్రాండ్‌) తన మాతృసంస్థ ద్వారా నిధుల సమీకరణ కోసం రెండేళ్ల నుంచీ ఎదురుచూస్తోంది. 2-4 ఏళ్లలో భారత పెట్టుబడిదార్లకు మెజారిటీ వాటా విక్రయించి, రూ.5000 కోట్లు సమీకరించాలని చూస్తున్నట్లు ఎమ్‌జీ మోటార్‌ ఇండియా ఇటీవలే ప్రకటించింది కూడా. కరోనా సమయంలో, తక్కువ విలువలకు దేశీయ కంపెనీలను బలవంతపు టేకోవర్‌ చేయకుండా ఉండడం కోసం ప్రెస్‌ నోట్‌-3ని 2020 ఏప్రిల్‌లో ప్రభుత్వం తీసుకొచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని