జీడీపీ @ 7.2 శాతం

భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంత వృద్ధిని నమోదు చేస్తున్న వర్థమాన దేశంగా తన హవాను కొనసాగించింది.

Updated : 01 Jun 2023 02:54 IST

2022-23లో అంచనాలకు మించి వృద్ధి
నాలుగో త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదు
రాణించిన వ్యవసాయం, తయారీ, గనులు

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంత వృద్ధిని నమోదు చేస్తున్న వర్థమాన దేశంగా తన హవాను కొనసాగించింది. 2022-23 జనవరి-మార్చి త్రైమాసికంలో 6.1% వృద్ధి చెందడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7.2 శాతానికి చేరింది. వ్యవసాయం (5.5%, తయారీ 4.5%, గనులు 4.3%, నిర్మాణ రంగం 10.4% రాణించడం ఇందుకు ఉపకరించింది. బుధవారమిక్కడ విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ 3.3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.272 లక్షల కోట్ల) స్థాయికి చేరింది. కొన్నేళ్లలో మన ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యానికి ఇది దన్నుగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 2021-22లో భారత జీడీపీ 9.1% రాణించగా.. అదే ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో వృద్ధిరేటు 4 శాతంగా ఉంది.

గత అంచనా 7 శాతమే: జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల్లో, 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7 శాతంగా నమోదవ్వొచ్చని పేర్కొంది. తాజా గణాంకాల్లో అంతకు మించి 7.2 శాతంగా నమోదైంది.

2.8 లక్షల కోట్ల డాలర్ల నుంచి..

ప్రస్తుత ధరల వద్ద జీడీపీ లేదా నామినల్‌ జీడీపీ 2022-23లో రూ.272.41 లక్షల కోట్లు (3.3 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది. 2021-22లో ఇది రూ.234.71 లక్షల కోట్లు (2.8 లక్షల కోట్ల డాలర్లు)గా ఉంది. అంటే    16.1%  వృద్ధి చెందిందని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది.
నీ స్థిర ధరల వద్ద (2011-12 ప్రకారం) నాలుగో త్రైమాసికం (2022-23)లో జీడీపీ రూ.43.62 లక్షల కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాలంలో నమోదైన రూ.41.12 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.1 శాతం ఎక్కువ.

* ప్రస్తుత ధరల వద్ద జీడీపీ 2022-23 నాలుగో త్రైమాసికంలో రూ.71.82 లక్షల కోట్లుగా నమోదైంది. 2021-22 నాలుగో త్రైమాసికం నాటి రూ.65.05 లక్షల కోట్లతో పోలిస్తే ఇది     10.4% పెరిగినట్లు లెక్క.

* స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి 2022-23లో 7 శాతానికి చేరగా.. అంతక్రితం ఏడాది 8.8 శాతంగా ఉంది.  2022-23లో జాతీయ ఆదాయం రూ.3,80,964 కోట్లకు చేరింది. 2021-22లో నమోదైన రూ.4,47,182 కోట్లతో పోలిస్తే ఇది తక్కువ.

6.4 శాతంగా ద్రవ్యలోటు: గత ఆర్థిక సంవత్సరం(2022-23)లో ద్రవ్యలోటు.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 6.4 శాతంగా నమోదైంది. రూపాయల్లో ద్రవ్యలోటు రూ.17,33,131 కోట్ల (తాత్కాలికం)కు చేరిందని సీజీఏ పేర్కొంది.  

6 నెలల కనిష్ఠానికి మౌలికం: ఈ ఏడాది ఏప్రిల్‌లో మౌలిక రంగ వృద్ధి 6 నెలల కనిష్ఠమైన 3.5 శాతానికి పరిమితమైంది. ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్‌ రంగాల ఉత్పత్తి తగ్గడంతో 8 కీలక రంగాల వృద్ధి 3.5 శాతంగా నమోదైంది. మౌలిక రంగాల వృద్ధి 2022 ఏప్రిల్‌లో 9.5 శాతంగా ఉండగా, ఈ ఏడాది మార్చిలో 3.6 శాతంగా ఉంది.  


అంతర్జాతీయ సవాళ్లలోనూ.. భారత ఆర్థిక వ్యవస్థ 7.2% మేర రాణించడం.. అంతర్జాతీయ సవాళ్లను భారత్‌ ఎంత సమర్థంగా ఎదుర్కుందో వెల్లడిస్తోంది. పూర్తి ఆశావహ దృక్పథంతో సాగి, బలమైన పనితీరును నమోదు చేశాం. భవిష్యత్‌లోనూ మన ఆర్థిక వ్యవస్థకు ఢోకా ఉండదన్న ధీమానిచ్చాం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


అంచనాలకు మించే రాణిస్తుంది

భారత్‌ మరో ఏడాదీ బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదవుతుందన్న అంచనాలున్నాయి. ఇంతకు మించి కూడా నమోదు కావచ్చు. స్థూల ఆర్థిక పరిస్థితులు,  ద్రవ్య స్థిరత్వం కారణంగా దేశం స్థిరమైన వృద్ధి బాటలో పయనిస్తున్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ భారత్‌ అంచనాలకు మించి రాణించగలదని భావిస్తున్నాం.

ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని