భారీగా జీఎస్‌టీ వసూళ్లు

వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా మూడో నెలా రూ.1.50 లక్షల కోట్లను  అధిగమించాయి. గతేడాది మే నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది మే నెలలో వసూళ్లు 12% పెరిగి రూ.1.57 లక్షల కోట్లకు చేరాయి

Published : 02 Jun 2023 03:51 IST

మూడో నెలా రూ.1.5 లక్షల కోట్లకు పైనే

దిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా మూడో నెలా రూ.1.50 లక్షల కోట్లను  అధిగమించాయి. గతేడాది మే నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది మే నెలలో వసూళ్లు 12% పెరిగి రూ.1.57 లక్షల కోట్లకు చేరాయి. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లను అధిగమించడం ఇది అయిదో సారి. రూ.1.4 లక్షల కోట్లకు పైగా నమోదు కావడం వరుసగా 14వ నెల. గతేడాదిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా కొనసాగడాన్ని ఈ వసూళ్లు ప్రతిబింబిస్తున్నాయని పన్ను నిపుణులు అంటున్నారు.

ఈ ఏడాది మేలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1,57,090 కోట్లకు చేరాయి. ఇందులో కేంద్ర జీఎస్‌టీ రూ.28,411 కోట్లు; రాష్ట్ర జీఎస్‌టీ రూ.35,828 కోట్లు: సమ్మిళిత జీఎస్‌టీ రూ.81,363 కోట్లు(వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.41,722 కోట్లు కలిపి)గా నమోదయ్యాయి. సెస్సు రూ.11,489 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలైన రూ.1,057 కోట్లు కలిపి) ఉందని ఆర్థిక శాఖ వివరించింది.

* గతేడాది మేతో పోలిస్తే వస్తువుల దిగుమతి ద్వారా ఆదాయం 12%, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాలు 11% రాణించాయి.

వచ్చే కొద్ది నెలలూ రూ.1.55-1.65 లక్షల కోట్లపైనే: మే నెలలో అంచనాల కంటే కాస్త ఎక్కువగానే జీఎస్‌టీ ఆదాయాలు నమోదయ్యాయని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. ‘వచ్చే కొద్ది నెలల పాటు జీఎస్‌టీ నెలవారీ ఆదాయాలు రూ.1.55-1.65 లక్షల కోట్ల మేర నమోదుకావొచ్చు. ఏడాది కిందటితో పోలిస్తే ఇవి 10-11 శాతం మేర వృద్ధి చెందొచ్చ’ని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని