ఏఐ వల్ల మా ఉద్యోగాలు పోతాయ్‌

కృత్రిమ మేధ(ఏఐ) తమ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతుందేమోనని భారత్‌లోని 74 శాతం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మైక్రోసాఫ్ట్‌ తన సర్వేలో పేర్కొంది. గురువారం వెలువడ్డ ఈ సర్వే ‘మైక్రోసాఫ్ట్‌ వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌ 2023’ ప్రకారం..

Updated : 02 Jun 2023 04:42 IST

74% భారతీయుల ఆందోళన
మైక్రోసాఫ్ట్‌ నివేదిక

దిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) తమ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతుందేమోనని భారత్‌లోని 74 శాతం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మైక్రోసాఫ్ట్‌ తన సర్వేలో పేర్కొంది. గురువారం వెలువడ్డ ఈ సర్వే ‘మైక్రోసాఫ్ట్‌ వర్క్‌ ట్రెండ్‌ ఇండెక్స్‌ 2023’ ప్రకారం..

* భారత్‌లో నాలుగింట మూడొంతుల మంది తమ పనిని సాధ్యమైనంత వరకు ఏఐకు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

*  90 శాతం మంది భారతీయ కంపెనీల నిర్వాహకులు, ఏఐ వృద్ధికి తగ్గట్లుగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

* వినూత్నత కొరవడుతోందని నాలుగింట మూడొంతుల(84%) సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. సమావేశాలు సరిగ్గా జరగకపోవడమే. తాము సగం సమావేశాలకు హాజరుకాకపోయినా సహచరులు గుర్తించలేకపోతున్నారని 46% మంది సిబ్బంది భావిస్తున్నారు.

* ఏఐ నిపుణులే కాదు.. ప్రతి ఉద్యోగి తమ రోజువారీ పనుల్లో భాగంగా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలని నివేదిక అభిప్రాయపడింది.

* ప్రస్తుతం తమ పనులు పూర్తి చేయడానికి తగిన సామర్థ్యాలు తమ వద్ద లేవని భారతీయ సిబ్బంది అనుకుంటున్నారు.

ఏఐతో సులువుగా పనులు: ‘ఏఐ వల్ల రోజువారీ పనుల్లో భారీ మార్పులు రావొచ్చు. సరికొత్త ఉత్పాదకత వృద్ధి దశకు తదుపరి తరం ఏఐ తలుపులు తెరవగలదు. వీటి వల్ల పనుల్లో కఠినత్వం తొలగుతుంది. ఉల్లాసంగా, వినూత్నంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే ప్రతి సంస్థా, ఉన్నతాధికారులు ఆ దిశగా ఏఐను అందిపుచ్చుకోవాలి. ప్రతి ఉద్యోగి భవిష్యత్‌ అవసరాలకు కొత్త దారులు వేసేలా ఏఐని పరీక్షించి, అందించాల’ని మైక్రోసాఫ్ట్‌ కంట్రీ హెడ్‌ భాస్కర్‌ బసు పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని