రెండో రోజూ నష్టాలే

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బ్యాంకింగ్‌, లోహ, ఇంధన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 35 పైసలు బలపడి 82.40 వద్ద ముగిసింది.

Updated : 02 Jun 2023 04:25 IST

సమీక్ష

ద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బ్యాంకింగ్‌, లోహ, ఇంధన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 35 పైసలు బలపడి 82.40 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.17% నష్టంతో 72.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్‌, హాంకాంగ్‌ నష్టపోగా, టోక్యో, షాంఘై రాణించాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,736.47 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అయితే రోజంతా ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీ.. ఒకదశలో 62,359.14 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 193.70 పాయింట్ల నష్టంతో 62,428.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 46.65 పాయింట్లు తగ్గి 18,487.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,464.55- 18,580.30 పాయింట్ల మధ్య కదలాడింది.

*  సెన్సెక్స్‌ 30 షేర్లలో 12 డీలాపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 3.42%, కోటక్‌ బ్యాంక్‌ 3.31%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.31%, ఐటీసీ 1.24%, రిలయన్స్‌ 0.51% నష్టపోయాయి. టాటా మోటార్స్‌ 1.67%, హెచ్‌యూఎల్‌ 1.39%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.32%, సన్‌ఫార్మా  1.12%, టీసీఎస్‌ 0.98% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్‌, లోహ, ఇంధన, ఆర్థిక సేవలు, టెలికాం, కమొడిటీస్‌ 0.82% వరకు పడ్డాయి. స్థిరాస్తి 1.19%, ఆరోగ్య సంరక్షణ 0.84%, వినియోగ 0.64%, యుటిలిటీస్‌ 0.68%, ఐటీ 0.52% మెరిశాయి. బీఎస్‌ఈలో 2030 షేర్లు నష్టాల్లో ముగియగా, 1513 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 118 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

*  కోల్‌ ఇండియా ఓఎఫ్‌ఎస్‌కు అధిక స్పందన: కోల్‌ ఇండియాలో 3% ప్రభుత్వ వాటా విక్రయానికి తలపెట్టిన ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)కు సంస్థాగత మదుపర్ల నుంచి అధిక స్పందన లభించింది. గురువారం రూ.6,500 కోట్ల విలువైన బిడ్‌లు దాఖలయ్యాయి. సంస్థలో 1.5 శాతానికి సమానమైన 8.31 కోట్లకు పైగా షేర్లను సంస్థాగత మదుపర్లకు ప్రభుత్వం ఆఫర్‌ చేయగా.. 28.76 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. అంటే 3.46 రెట్ల స్పందన నమోదైంది. ఒక్కో షేరు రూ.226.12 లెక్కన ఈ బిడ్‌ల విలువ దాదాపు రూ.6,500 కోట్లు. వాటా విక్రయానికి అధిక స్పందన రావడంతో ప్రభుత్వం గ్రీన్‌ షూ ఆప్షన్‌ వినియోగించి మరో 1.5 శాతం వాటాను విక్రయించనుంది. రిటైల్‌ మదుపర్లు నేడు (శుక్రవారం) బిడ్లు దాఖలు చేయొచ్చు.

* ఎల్‌ఈడీ లైటింగ్‌ సొల్యూషన్‌లు అందించే ఐకియో లైటింగ్‌ లిమిటెడ్‌ ఐపీఓ ఈ నెల 6న ప్రారంభమైన 8న ముగియనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.270- 285ను నిర్ణయించారు. జూన్‌ 5న యాంకర్‌ మదుపర్లు బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చు. ధరల శ్రేణిలో గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.606.6 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ.350 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో 90 లక్షల వరకు ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.

* ఐఆర్‌సీటీసీ ఛైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సీమా కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె రైల్వే బోర్డులో అదనపు సభ్యురాలు (టూరిజం, క్యాటరింగ్‌)గా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి నియామకం జరిగేంత వరకు ఆమె పదవిలో కొనసాగుతారు.

* కళానిధి మారన్‌, ఆయనకు చెందిన కల్‌ ఎయిర్‌వేస్‌కు చెల్లించాల్సిన రూ.578 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారంపై రూ.75 కోట్లు వడ్డీ చెల్లించాల్సిందిగా స్పైస్‌జెట్‌ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి 2023 ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఎటువంటి మార్పులు లేవని, తీర్పును అమలు చేయాల్సిందిగా సూచించింది.  

* అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ ద్వారా ఏళ్ల పాటు పిల్లల వాయిస్‌, లొకేషన్‌ డేటాను తీసుకుని తల్లిదండ్రులను మోసం చేయడం, పిల్లల భద్రతా చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌కు 25 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.220 కోట్లు) చెల్లించడానికి అమెజాన్‌ అంగీకరించింది. డోర్‌బెల్‌ కెమేరా రింగ్‌కు సంబంధించి గోప్యతా ఉల్లంఘనలపై 5.8 మి.డాలర్లు కూడా కంపెనీ చెల్లించనుంది.

* ఆర్థిక సేవల విభాగం ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో రూ.1250 కోట్లు చొప్పించనున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌ వెల్లడించింది.

* విశాఖపట్నం, హైదరాబాద్‌ సహా మొత్తం 11 ప్రాంతాల్లో కొత్త హోటళ్ల ఏర్పాటుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒప్పందం చేసుకున్నట్లు రాడిసన్‌ హోటల్‌ గ్రూప్‌ ప్రకటించింది.

* అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరును ఈనెల 2 నుంచి షార్ట్‌ టర్మ్‌ ఏఎస్‌ఎం నిబంధనావళి పరిధిలోంచి తొలగిస్తున్నట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎన్‌ఈ తెలిపాయి.

* 16వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తడ నుంచి నెల్లూరు వరకు ఉన్న 110 కిలోమీటర్లు; 65వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా నందిగామ నుంచి విజయవాడ వరకు ఉన్న 48 కిలోమీటర్ల మార్గాన్ని కొనుగోలు చేసేందుకు 2022 ఆగస్టులో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెల్లడించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని