కొత్త విమానాలకు అమిత గిరాకీ

అంతర్జాతీయంగా విమాన ప్రయాణికుల రద్దీలో వృద్ధి ఎక్కువగా ఉన్న మార్కెట్లలో ఒకటైన భారత్‌.. ప్రపంచంలోనే అత్యంత కీలక విమానాల మార్కెట్‌గా అవతరించనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది.

Updated : 02 Jun 2023 04:10 IST

మధ్యతరగతి పెరుగుతుండడమే కారణం
భారత విపణిపై బార్‌క్లేస్‌ నివేదిక

దిల్లీ: అంతర్జాతీయంగా విమాన ప్రయాణికుల రద్దీలో వృద్ధి ఎక్కువగా ఉన్న మార్కెట్లలో ఒకటైన భారత్‌.. ప్రపంచంలోనే అత్యంత కీలక విమానాల మార్కెట్‌గా అవతరించనుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. ప్రయాణికుల, రక్షణ విమానాలు సరికొత్తవి భారత్‌కు అధికంగా కావాల్సి ఉందని పేర్కొంది. అమెరికా, చైనా తరవాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన విపణిగా భారత్‌ ఉంది. విమానాల మార్కెట్‌లో భారత్‌కు ప్రాధాన్యం పెరగడంపై, ఇతరత్రా అంశాలపై బార్‌క్లేస్‌ నివేదిక ఏమంటోందంటే..

* మధ్యతరగతి జనాభా పెరుగుతుండడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాంతీయ అనుసంధాన పథకం (ఉడాన్‌) వల్ల విమాన ప్రయాణాలకు ఊతం లభిస్తోంది. ఇందువల్లే

 మరిన్ని విమానాల అవసరం పెరుగుతోంది.: 2006 నుంచి 2019 మధ్య దేశీయ విమాన ప్రయాణికుల రద్దీలో 11 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) నమోదైంది. దీర్ఘకాల అంతర్జాతీయ సగటు అంచనా కంటే 2 శాతం అధికంగానే భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది.

* 2009-22 మధ్య భారత విమానయాన సంస్థలు 1400 విమానాలకు ఆర్డర్లు పెట్టాయి. ఇపుడు అమెరికా తర్వాత అత్యధిక విమానాలకు ఆర్డర్లు మనవే. బోయింగ్‌, ఎయిర్‌బస్‌ అన్ని డెలివరీల్లో 7 శాతం భారతే తీసుకుంటోంది. * ఇండిగో, ఆకాశ ఎయిర్‌ సంస్థలు తమ మార్కెట్‌ వాటా పెంచుకోవడం కోసం విమానాలకు ఆర్డర్లు పెడుతున్నాయి. కార్యకలాపాలు మొదలు పెట్టనున్న  జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా కొత్త విమానాలను చూస్తోంది. * 2009 నుంచి ఇప్పటిదాకా భారత విమాన సంస్థల నుంచి 65 శాతం ఆర్డర్లు ఎయిర్‌బస్‌ పొందింది. దేశీయ సంస్థలు తక్కువ వెడల్పు (నారో బాడీ) విమానాల వైపు మొగ్గుచూపుతుండడం ఇందుకు కారణం.

రక్షణ రంగం విషయానికొస్తే.. 2022లో భారత మొత్తం రక్షణ వ్యయాలు 81.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా అత్యధిక రక్షణ కేటాయింపుల్లో ఇవి నాలుగో స్థానంలో ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా ఇంతకంటే ముందున్నాయి. * భారత రక్షణ వ్యయాలు గత రెండు దశాబ్దాల్లో 9 శాతం పైగా సీఏజీఆర్‌తో పెరుగుతూ వచ్చాయి. చైనా మిలటరీ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవి మరింతగా వృద్ధి చెందొచ్చు. * రక్షణ సామగ్రి విషయంలో సౌదీ అరేబియా కంటే ముందు నిలిచి అతిపెద్ద దిగుమతిదారుగా భారత్‌ అవతరించింది. 2018-22 మధ్య అంతర్జాతీయ మిలటరీ సామగ్రి దిగుమతుల్లో 11 శాతం మనవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని