ఫార్మాలోనూ ఐటీ తరహా వృద్ధి

దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)కి 3 దశాబ్దాల క్రితం లభించిన వృద్ధి అవకాశం వంటిది ఇప్పుడు ఫార్మా పరిశ్రమకు కనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు.

Published : 02 Jun 2023 04:38 IST

డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
‘ఫార్మాలిటికా’ ప్రదర్శనలో వక్తలు

ఈనాడు - హైదరాబాద్‌: దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)కి 3 దశాబ్దాల క్రితం లభించిన వృద్ధి అవకాశం వంటిది ఇప్పుడు ఫార్మా పరిశ్రమకు కనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు. ఔషధ రంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనల్లో ఒకటైన ఫార్మాలిటికా- 9వ ఎడిషన్‌ను గురువారం ఇక్కడ ఆయన ప్రారంభించారు. ఐటీ, ఫార్మా, బయోటెక్‌, వైద్య ఉపకరణాల తయారీల్లో తెలంగాణ అత్యంత వేగవంత వృద్ధి సాధిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో ఫార్మా, బయోటెక్నాలజీ, వైద్య ఉపకరణాల తయారీ, అనుబంధ పరిశ్రమల వ్యాపార పరిమాణం 2014లో 50 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4.10 లక్షల కోట్లు) కాగా, అప్పటి నుంచి పదేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు గుర్తు చేశారు. గత ఏడాదికే ఈ పరిమాణం 80 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.56 లక్షల కోట్ల)కు చేరిందని తెలిపారు. దీంతో ఈ లక్ష్యాన్ని 250 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.20.50 లక్షల కోట్ల)కు పెంచుకున్నట్లు వెల్లడించారు. ఔషధ తయారీలో డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం బాగా పెరుగుతోందని, దీన్ని అందిపుచ్చుకోవడానికి హైదరాబాద్‌ను మించిన అనువైన ప్రదేశం మరొకటి లేదని ఆయన చెప్పారు. ఔషధ తయారీలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక యంత్రాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఫార్మాలిటికా ద్వారా పరిశ్రమ వర్గాలకు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.  

రోగుల భద్రతకు అధిక ప్రాధాన్యం

మందుల తయారీకి సంబంధించిన నాణ్యతా ప్రమాణాల రూపకల్పనలో రోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని క్యూడాట్‌ అసోసియేట్స్‌ సీఈఓ డాక్టర్‌ బి.ఎం.రావు తెలిపారు. విశ్లేషణాత్మక ప్రక్రియలకు సంబంధించిన శాస్త్రీయ విధానాలను ఆయన ప్రస్తావించారు. ఫార్మా యూనిట్లలోని క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌లలో ‘రియల్‌ టైమ్‌ టెస్టింగ్‌’ సమయంలో, ఐసీహెచ్‌ క్యూ14, ఐసీహెచ్‌ క్యూ2 (ఆర్‌2) మార్గదర్శకాల ప్రకారం అభివృద్ధి చేసిన పరీక్షా ప్రమాణాలను (టెస్టింగ్‌ మెథడ్స్‌) విధిగా పాటించాలని సూచించారు. అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన ఈ పరీక్షా ప్రమాణాలను అనుసరిస్తే, ఫలితాలు నమ్మదగినవిగా ఉంటాయని తెలిపారు. తద్వారా మందుల తయారీలో మొదటి దశ నుంచి రోగి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందన్నారు. పెద్ద కంపెనీలు ఇప్పటికే వీటిని అమలు చేస్తున్నాయని, మిగిలిన కంపెనీలు కూడా పాటించాలని సూచించారు. అంతర్జాతీయంగా మందుల అమ్మకాలను పెంచుకోవాలంటే, నూతన ప్రమాణాలను విధిగా అనుసరించాలని ఆయన వివరించారు.

‘ఫార్మా సిటీ’కి భారీగా పెట్టుబడులు

3 రోజుల పాటు జరిగే ఫార్మాలిటికా- 9వ ఎడిషన్‌లో 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 250 మంది ప్రతినిధులు పాల్గొంటుండగా, వివిధ దేశాల నుంచి సందర్శకులు వస్తున్నారు. ఈ ప్రదర్శనకు ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’, బీడీఎంఏ, కర్ణాటక డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ మానుఫ్యాక్చరర్స్‌ అసోషియేషన్‌ వంటి సంస్థలు మద్దతు ఇస్తున్నాయని ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఎండీ యోగేష్‌ ముద్రాస్‌ అన్నారు. బీడీఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్‌కే అగర్వాల్‌ మాట్లాడుతూ తెలంగాణాలో సిద్ధమవుతున్న ‘ఫార్మా సిటీ’కి, రూ.20,000 కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించే సత్తా ఉందని అన్నారు. ఫార్మా రంగం ఏటా 10% వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఏసీజీ చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ శంకర్‌ గుప్తా,  డాక్టర్‌ రెడ్డీస్‌ ఉపాధ్యక్షుడు ఏకే తల్వార్‌, కర్ణాటక డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ మానుఫ్యాక్చరర్స్‌ అధ్యక్షుడు హరీష్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని