అథెనా గ్లోబల్‌ టెక్నాలజీస్‌కు పెరిగిన నష్టాలు

హైదరాబాద్‌కు చెందిన అథెనా గ్లోబల్‌ టెక్నాలజీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.2.07 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.3.32 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

Updated : 03 Jun 2023 04:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన అథెనా గ్లోబల్‌ టెక్నాలజీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.2.07 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.3.32 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయంలో ఇతర ఆదాయం రూ.50 లక్షలు ఉంది. సబ్సిడరీ కంపెనీలైన మెడ్లే మెడికల్‌ సొల్యూషన్స్‌కు ఇచ్చిన అప్పు మీద రావలసి వడ్డీ రూ.27.35 లక్షలు, ట్యూటరూట్‌ టెక్నాలజీస్‌కు ఇచ్చిన అప్పు మీద వడ్డీ రూ.18.93 లక్షలు ఇతర ఆదాయంలో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో అథెనా గ్లోబల్‌ మొత్తం ఆదాయం రూ.3.92 కోట్లు, నికర నష్టం రూ.65.18 లక్షలు ఉన్నాయి. దీంతో పోల్చితే ప్రస్తుతం ఆదాయం తగ్గి, నష్టాలు పెరిగిన విషయం స్పష్టమవుతుంది. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి మొత్తం ఆదాయం రూ.11.54 కోట్లు, నికర నష్టం రూ.8.90 కోట్లు ఉన్నాయి. కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.12.59 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.22.02 కోట్ల నికర నష్టాన్ని ఈ సంస్థ నమోదు చేసింది.  


16 రోజుల్లోనే ఐటీ రిఫండు: సీబీడీటీ  

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారికి సగటున 16 రోజుల్లోనే రిఫండును వెనక్కి ఇచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఛైర్మన్‌ నితిన్‌ గుప్తా అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 80 శాతానికి పైగా రిటర్నులు 30 రోజుల్లోపే అందించినట్లు వివరించారు. స్వచ్ఛందంగా పన్ను దాఖలు చేసే వారిని ప్రోత్సహించేందుకు ఐటీ విభాగం ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికత వినియోగాన్ని పెంచుతోందని తెలిపారు. 2021-22లో సగటున 26 రోజుల్లో రిఫండు అందగా, 2022-23లో ఈ వ్యవధి 16 రోజులకు తగ్గిందని వివరించారు. రిటర్నులు దాఖలు చేసిన ఒక రోజులోనే వాటిని ప్రాసెస్‌ చేయడం 100% పెరిగిందన్నారు.


* నియంత్రణ నిబంధనలు సరిగా పాటించనందుకు ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ)పై రూ.2.20 కోట్ల అపరాధ రుసుమును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) విధించింది.

* విద్యుత్‌ను ఆదా చేసే ఉపకరణాలు, ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌ లైట్లు, అధిక సామర్థ్యంతో కూడిన ఫ్యాన్లను వినియోగించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌) విద్యుత్‌ ఆదా చేసే 10 మిలియన్ల ఎలక్ట్రిక్‌ ఫ్యాన్లను భారత్‌లో తీసుకురావాలని లక్ష్యంగా పని చేస్తోంది.

* సైబర్‌ భద్రతా రిస్కులను సమర్థంగా పరిష్కరించేందుకు అధీకృత బ్యాంకింగేతర చెల్లింపుల వ్యవస్థ ఆపరేటర్ల(పీఎస్‌ఓలు) కోసం పటిష్ఠమైన పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.

* లిథియం అయాన్‌ బ్యాటరీల కోసం గ్రాఫైట్‌ ఆనోడ్‌ మెటీరియల్‌ను ఫీడ్‌స్టాక్‌గా తయారు చేయడానికి పెట్‌ కోక్‌ను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంధన అవసరాల కోసం పెట్‌ కోక్‌ దిగుమతుల్ని పూర్తిగా నిషేధించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు