రాణించిన లోహ, వాహన షేర్లు

లోహ, టెలికాం, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దన్నుగా నిలిచాయి.

Updated : 03 Jun 2023 04:35 IST

సమీక్ష

లోహ, టెలికాం, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దన్నుగా నిలిచాయి. మేలో వాహన విక్రయాలు, జీఎస్‌టీ వసూళ్లు మెరుగ్గా నమోదుకావడం సెంటిమెంట్‌ను బలపరిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 82.31 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.74 శాతం లాభపడి 75.57 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,601.97 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 62,719.84 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. అనంతరం ఒకదశలో 62,379.86 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ కోలుకుని 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 46.35 పాయింట్లు పెరిగి 18,534.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,478.40- 18,573.70 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 45.42 పాయింట్లు, నిఫ్టీ 34.75 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

* మేలో వాహన విక్రయాలు 7 శాతం పెరగడంతో హీరో మోటోకార్ప్‌ షేరు 3.25 శాతం లాభంతో రూ.2,891.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,819.11 కోట్లు పెరిగి రూ.57,793.21 కోట్లకు చేరింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 మెరిశాయి. టాటా స్టీల్‌ 1.93%, మారుతీ 1.73%, ఎం అండ్‌ ఎం 1.71%, సన్‌ఫార్మా 1.20%, ఎల్‌ అండ్‌ టీ 1.19%, టైటన్‌ 1.16%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.98%, ఎస్‌బీఐ 0.79% చొప్పున లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.58% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో లోహ 1.71%, స్థిరాస్తి 1.33%, టెలికాం 1.06%, వాహన 0.98%, పరిశ్రమలు 0.85%, వినియోగ 0.83%, కమొడిటీస్‌ 0.73%, ఆరోగ్య సంరక్షణ 0.72% పెరిగాయి. ఐటీ, టెక్‌, యుటిలిటీస్‌, ఇంధన, చమురు-గ్యాస్‌ నీరసపడ్డాయి. బీఎస్‌ఈలో 2181 షేర్లు లాభపడగా, 1364 స్క్రిప్‌లు నష్టపోయాయి.

* కోల్‌ ఇండియా ఓఎఫ్‌ఎస్‌కు పూర్తి స్పందన: కోల్‌ ఇండియాలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా 3 శాతం ప్రభుత్వ వాటా విక్రయానికి రిటైల్‌, సంస్థాగత మదుపర్ల నుంచి పూర్తి స్పందన లభించింది. ప్రభుత్వం 18.48 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా.. 28.76 కోట్లకు పైగా షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. గురువారం రిటైల్‌ మదుపర్ల నుంచి 2.58 కోట్లకు పైగా షేర్లకు బిడ్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.4,000 కోట్లకు పైగా చేరే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.51,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

* ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలకు ఇండిగో విమానాలు: ఈ ఏడాది నైరోబి, తబలిసీ, తాష్కెంట్‌ సహా ఆరు ఆఫ్రికా, మధ్య ఆసియా గమ్యస్థానాలకు నేరుగా విమానాలు ప్రారంభించనున్నట్లు ఇండిగో వెల్లడించింది. జులై చివర్లో లేదా ఆగస్టు ప్రారంభంలో ముంబయి నుంచి నైరోబి (కెన్యా), జకార్తా (ఇండోనేషియా)లకు విమానాలు ప్రారంభించనుంది. ఆగస్టులో దిల్లీ నుంచి తబలిసీ (జార్జియా), బాకు (అజర్‌బైజార్‌)కు, సెప్టెంబరులో తాష్కెంట్‌ (ఉజ్బెకిస్థాన్‌), అల్‌మాటీ (కజకిస్థాన్‌)లకు ఇండిగో సేవలు మొదలుపెట్టనుంది. ప్రస్తుతం 26 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇండిగో విమానాలు నడుపుతుండగా.. వీటితో ఈ సంఖ్య 32కు పెరగనుంది. ఆగస్టులో దిల్లీ-హాంకాంగ్‌ మధ్య రోజువారీ విమాన సేవలను పునరుద్ధరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

* కెనరా బ్యాంక్‌ నేతృత్వంలోని  19 బ్యాంకుల కన్సార్షియంకు రూ.6,524 కోట్లకు పైగా నష్టం చేశారన్న ఆరోపణలపై ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం ఆరోపణలతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద ముంబయికి చెందిన ఐటీఎన్‌ఎల్‌, దాని డైరెక్టర్లు కరుణాకరన్‌ రామ్‌చంద్‌, దీపక్‌దాస్‌ గుప్తా, ముకుంద్‌ గజానన్‌ సప్రే, అప్పటి సీఎఫ్‌ఓ దిలీప్‌ లాల్‌చంద్‌ భాటియాలపై ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు మోపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని