తగ్గనున్న వంట నూనెల ధరలు!

వంట నూనెల ధరలను లీటరుకు రూ.8-12 మేర వెంటనే తగ్గించాలని వంట నూనెల తయారీ సంస్థల అసోసియేషన్లకు  శుక్రవారం కేంద్రం సూచించింది.

Published : 03 Jun 2023 02:04 IST

లీటరుకు రూ.8-12 మేర సవరించండి
పరిశ్రమ వర్గాలకు సూచించిన ప్రభుత్వం

దిల్లీ: వంట నూనెల ధరలను లీటరుకు రూ.8-12 మేర వెంటనే తగ్గించాలని వంట నూనెల తయారీ సంస్థల అసోసియేషన్లకు  శుక్రవారం కేంద్రం సూచించింది. అంతర్జాతీయ విపణిలో ధరలు నెమ్మదించిన నేపథ్యంలో అందుకనుగుణంగా దేశీయ వంట నూనెల ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘కొన్ని కంపెనీలు తమ వంట నూనెల ధరలను తగ్గించలేదు. మిగతా బ్రాండ్ల గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ)లతో పోలిస్తే వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆయా సంస్థలు వెంటనే ధరలు తగ్గించాలని సలహా ఇచ్చామ’ని ఆహార కార్యదర్శి సంజీవ్‌ చోప్రా అధ్యక్షతన జరిగిన పరిశ్రమ ప్రతినిధుల సమావేశం తర్వాత ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తయారీ, రిఫైనరీ సంస్థలు పంపిణీదార్లకు సరఫరా చేస్తున్న ధరలను కూడా వెంటనే తగ్గిస్తే ధరల తగ్గింపు వెంటనే వినియోగదార్లకు బదిలీ అవుతుందని పేర్కొంది. సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని చర్చించారు. వివిధ రకాల వంట నూనెల ధరలు గత 2 నెలల్లో టన్నుకు 150-200 డాలర్ల మేర తగ్గాయని, అందుకు అనుగుణంగా ఇప్పటికే దేశీయంగా ధరలు తగ్గించామని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే మరింత ధరల తగ్గింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని