20% వార్షిక వృద్ధి సాధిస్తాం

మౌలిక సదుపాయాల రంగానికి చెందిన కంపెనీ అయిన ఎన్‌సీసీ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో స్టాండ్‌ అలోన్‌ ఖాతాల ప్రకారం ఆదాయాల్లో 20 శాతం వృద్ధిని ఆశిస్తోంది.

Published : 03 Jun 2023 04:33 IST

ఎన్‌సీసీ లిమిటెడ్‌ అంచనా
రూ.50,000 కోట్లను మించిన ఆర్డరు పుస్తకం
తగ్గుతున్న రుణభారం

ఈనాడు, హైదరాబాద్‌: మౌలిక సదుపాయాల రంగానికి చెందిన కంపెనీ అయిన ఎన్‌సీసీ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో స్టాండ్‌ అలోన్‌ ఖాతాల ప్రకారం ఆదాయాల్లో 20 శాతం వృద్ధిని ఆశిస్తోంది. అదే విధంగా నికరలాభం 50 బేసిస్‌ పాయింట్ల మేరకు పెరిగే అవకాశం ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం ఇటీవల ఇన్వెస్టర్లతో నిర్వహించిన ‘కాన్ఫరెన్స్‌ కాల్‌’లో  వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి అత్యధిక స్థాయిలో కొత్త ఆర్డర్లు లభించాయి. అదే స్థాయిలో ఆర్డర్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ లభిస్తాయని అంచనా వేస్తోంది. మరోపక్క, రుణభారాన్ని తగ్గించుకుంటున్నట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పు ఇంకా తగ్గుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం ఎన్‌సీసీ లిమిటెడ్‌ రూ.15,701 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్‌ రూ.9.77 నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌ రూ.7.91 మాత్రమే కావటం గమనార్హం.

ఈ ఏడాదీ భారీగా కొత్త ఆర్డర్లు

ఎన్‌సీసీ లిమిటెడ్‌ ఆర్డర్‌ బుక్‌ రూ.50,000 కోట్లను మించిపోయింది. కంపెనీ చేతిలో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రూ.50,244 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.25,895 కోట్ల ఆర్డర్లు లభించటం ప్రత్యేకత. ఇదే స్థాయిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఆర్డర్లు  లభిస్తాయని ఎన్‌సీసీ లిమిటెడ్‌ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో (ఏప్రిల్‌) రూ.3,000 కోట్ల ఆర్డర్లు లభించటం గమనార్హం. ఇదే కాకుండా మే నెలలో మరో రూ.2,088 కోట్ల ఆర్డర్లు లభించినట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో నీటి పారుదల విభాగానికి చెందిన రూ.1,668 కోట్ల మేరకు ఆర్డర్లు ఉన్నాయి. పెద్దఎత్తున ఆర్డర్లు చేతిలో ఉన్నందున నిర్దేశించుకున్న వృద్ధి లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ యాజమాన్యం భావిస్తోంది.

ఆదాయాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో రుణభారాన్ని తగ్గించుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది. గత ఆర్థిక సంవత్సరాంతం నాటికి నికర రుణభారం రూ.1,000 కోట్ల కంటే కిందకు దిగివచ్చింది. ప్రస్తుతం కంపెనీకి నికరంగా రూ.974 కోట్ల అప్పు మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ రుణభారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కొంతకాలం క్రితం విక్రయించిన సెంబ్‌కార్ప్‌, ఎన్‌సీసీ వైజాగ్‌ అర్బన్‌ ప్రాజెక్టుల నుంచి ఎన్‌సీసీ లిమిటెడ్‌కు ఇంకా కొంత సొమ్ము రావలసి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ సొమ్ము వస్తే, దాన్ని అప్పు తీర్చటానికి కేటాయించాలని భావిస్తున్నారు. అదే జరిగితే రుణభారం ఇంకా తగ్గిపోతుంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి కింద రూ.275 కోట్లు కేటాయించినట్లు ఎన్‌సీసీ యాజమాన్యం వెల్లడించింది. నిధుల వ్యయం (ఫైనాన్స్‌ కాస్ట్‌) ఇప్పటి వరకూ ఉన్న 4.6 శాతం నుంచి 3.9 -4 శాతానికి దిగివచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రకారం చూస్తే.. నిధుల వ్యయం రూ.500 కోట్ల నుంచి రూ.520 కోట్లు ఉండవచ్చు. ‘ట్రేడ్‌ రిసీవబుల్స్‌’ రోజులు 97 రోజుల నుంచి 87 రోజులకు తగ్గినట్లు వివరించింది. దీనివల్ల నిర్వహణ మూలధనంపై ఒత్తిడి తగ్గుతుంది. వడ్డీ భారం కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని