ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా బాధ్యతల స్వీకరణ
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ బ్యాంక్ పగ్గాలు చేపట్టిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌గా 63 ఏళ్ల బంగా చరిత్ర సృష్టించారు.
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ బ్యాంక్ పగ్గాలు చేపట్టిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌గా 63 ఏళ్ల బంగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా ఆయన అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ ఏడాది మే 3న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బంగాను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఫిబ్రవరిలో బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అమెరికా నామినేట్ చేస్తున్నట్లు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బంగా శుక్రవారం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అడుగుపెడుతున్న చిత్రాన్ని ప్రపంచ బ్యాంక్ ట్వీట్ చేసింది. పేదరిక రహిత ప్రపంచానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అజయ్ బంగాకు ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జీవా శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరిలో అధ్యక్షుడిగా వైదొలిగిన డేవిడ్ మల్‌పాస్ స్థానాన్ని బంగా భర్తీ చేయనున్నారు.
* బంగా ఇటీవల జనరల్ అట్లాంటిక్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకుముందు దాదాపు 24,000 మంది ఉద్యోగులు కలిగిన అంతర్జాతీయ సంస్థ మాస్టర్‌కార్డ్ అధ్యక్షుడు, సీఈఓగా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో మాస్టర్ కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్‌ను తీసుకొచ్చింది. 2016లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును పొందారు.
భారత్‌కు టెస్లా ప్రతినిధులు!
ప్రభుత్వ అధికారులతో సమావేశం
దిల్లీ: ప్రపంచ దిగ్గజ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా, భారత ప్రభుత్వాన్ని తాజాగా సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ప్రస్తుతానికి విద్యుత్తు కార్ల దిగుమతిపై సుంకం తగ్గింపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించకపోవచ్చని తెలిపారు. టెస్లా ప్రతినిధులు ప్రభుత్వంతో ఒక సమావేశం ఏర్పాటు చేయమని అధికారులను సంప్రదించారని పేర్కొన్నారు. విద్యుత్తు కార్ల దిగుమతిపై సుంకం తగ్గించాలంటూ గతంలో టెస్లా కంపెనీ కోరడాన్ని ప్రస్తావిస్తూ, ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘ఇప్పుడు కూడా అదే ప్రతిపాదనతో టెస్లా ప్రతినిధులు వస్తారా? వేరొక ప్రతిపాదనను సిద్ధం చేసుకుని వస్తున్నారా’ అనేది తెలియాల్సి ఉందని వెల్లడించారు. టెస్లా ప్రతినిధులు భారత్‌కు రావాలనుకుంటుండటం, ఇక్కడి విధాన నిర్ణేతలతో సమావేశం కానుండటంతో భారత్‌లో టెస్లా ప్రవేశంపై మరోసారి చర్చకు దారి తీసింది.
* భారత్‌లోకి దిగుమతి చేసుకునే విలాసవంత కార్లపై ప్రభుత్వం భారీగా సుంకం విధిస్తోంది. కారు ధర, బీమా, రవాణా ఛార్జీల మొత్తం కలిపి 40,000 డాలర్లు దాటిన కార్లపై 100 శాతం సుంకం విధిస్తోంది. టెస్లా మోడళ్లన్నీ దాదాపు ఈ విభాగంలోకే వస్తాయి. దీంతో దిగుమతి సుంకాలు తగ్గించాలని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గతంలోనే మన ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ విక్రయాల తీరు ఆధారంగా, తదుపరి స్థానిక తయారీపై ఆలోచిస్తామని తెలిపారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. తాజా సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
యూకో బ్యాంక్ ఎండీ, సీఈఓగా అశ్వినీ కుమార్
దిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ కొత్త ఎండీ, సీఈఓగా అశ్వినీ కుమార్ నియమితులయ్యారు. ఎస్.ఎస్. ప్రసాద్ స్థానంలో జూన్ 1న ఈయన బాధ్యతలు స్వీకరించారు. అంతక్రితం ఈయన ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన కుమార్‌కు బ్యాంకింగ్‌లో చాలా ఏళ్ల అనుభవం ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఈ షేర్లు మీ దగ్గరున్నాయా?
52 వారాల గరిష్ఠానికి 132 స్క్రిప్‌లు
ముంబయి: బీఎస్‌ఈ 500 సూచీలోని 132 షేర్లు గత నెలలో 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. మార్కెట్లలో కొనసాగుతున్న సానుకూల పవనాలు ఇందుకు దోహదం చేశాయి. ఇందులో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐఓసీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌ఏఎల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండిగో, టైటన్, అల్ట్రాటెక్, డీఎల్‌ఎఫ్, వరుణ్ బేవరేజెస్, డెల్టా కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్‌పీసీఎల్ తదితర షేర్లు ఉన్నాయి. గత ఏడాది నవంబరులో నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 18,758 పాయింట్లను తాకింది. 2023లో తొలి 3 నెలలు ప్రతికూల ధోరణి కనిపించినా, ఏప్రిల్ నుంచి సానుకూలంగా మారింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నా.. ఎఫ్‌ఐఐల నుంచి స్థిరమైన కొనుగోళ్లు లభిస్తుండటంతో ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్ మే నెలలో 2 శాతం వరకు లాభపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం