ఈటీఎఫ్‌ల కోసం మ్యూచువల్‌ ఫండ్‌ లైట్‌

ప్యాసివ్‌ ఫండ్‌ల నిబంధనలను సరళీకృతం చేయడం, మదుపరులకు ఖర్చు తగ్గించి, రాబడిని పెంచడం లాంటి ప్రయత్నాల్లో భాగంగా మ్యూచువల్‌ ఫండ్‌ లైట్‌ నిబంధనలను తీసుకొచ్చేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ప్రయత్నిస్తోంది.

Published : 04 Jun 2023 01:59 IST

కొత్త నిబంధనలు తీసుకొస్తున్న సెబీ

దిల్లీ: ప్యాసివ్‌ ఫండ్‌ల నిబంధనలను సరళీకృతం చేయడం, మదుపరులకు ఖర్చు తగ్గించి, రాబడిని పెంచడం లాంటి ప్రయత్నాల్లో భాగంగా మ్యూచువల్‌ ఫండ్‌ లైట్‌ నిబంధనలను తీసుకొచ్చేందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని సెబీ జీవితకాల డైరెక్టర్‌ అనంత బారువా వెల్లడించారు. నిర్దిష్ట మార్కెట్‌ సూచీ ఆధారంగా ప్యాసివ్‌ ఫండ్లు పనిచేస్తుంటాయి. ప్యాసివ్‌ ఇండెక్స్‌ ఫండ్లు, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (ఈటీఎఫ్‌)లు, ఈటీఎఫ్‌లలో మదుపు చేసే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్లు ఇందులో ఉంటాయి. అంతర్లీనంగా సూచీల ఆధారంగా పనిచేసే ఈ ఫండ్ల నిర్వహణలో ఫండ్‌ నిర్వాహకుల విచక్షణ పెద్దగా ఉండదు. ఈ నేపథ్యంలో ప్యాసివ్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌లపై నిబంధనలను తగ్గించే దిశగా మ్యూచువల్‌ ఫండ్‌ లైట్‌ను తీసుకురానునట్లు అనంత బారువా తెలిపారు. కొత్త నిబంధనలు ఇండెక్స్‌ ఫండ్‌లు, ఈటీఎఫ్‌లకు మరింత సౌలభ్యాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. పాదర్శకత, వైవిధ్యం పెరగడంతోపాటు తక్కువ ఖర్చులతో మదుపు చేసేందుకు వీలు కల్పిస్తాయన్నారు. ఆసోచామ్‌ నిర్వహించిన మ్యూచువల్‌ ఫండ్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో ప్యాసివ్‌ పెట్టుబడులను ప్రోత్సహించాలని సెబీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. డెట్‌ మార్కెట్లో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు, నష్టాలను అధిగమించేందుకు ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్లను అందుబాటులో ఉంచిందని పేర్కొన్నారు. మ్యూచవల్‌ ఫండ్ల నిర్వహణలో మంచి పనితీరును ప్రోత్సహించేందుకు సెబీ కట్టుబడి ఉందని బారువా తెలిపారు. ఫీజులు, ఖర్చుల న్యాయబద్ధతను పరిశీలించడం, పనితీరు, దుర్వినియోగాన్ని నిరోధించడం లాంటి వాటి విషయాల్లో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల ట్రస్టీల బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. ఫండ్‌ సంస్థలు తాము పెట్టుబడి పెట్టిన సంస్థల ఓటింగ్‌, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విషయాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని