ఇబ్బంది పెట్టే కాల్స్‌కు ఇక చెక్‌!

ఇబ్బందికరమైన కాల్స్‌, సందేశాల (ఎస్‌ఎమ్‌ఎస్‌) ముప్పును అరికట్టేందుకు వీలుగా ప్రచార కాల్స్‌, సందేశాలకు వినియోగదార్ల సమ్మతి తీసుకునేలా 2 నెలల్లోపు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలను టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్‌) ఆదేశించింది.

Published : 04 Jun 2023 01:59 IST

ప్రచార కాల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌లకు వినియోగదార్ల సమ్మతి తీసుకోవాలి
2 నెలల్లో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి చేయండి
టెలికాం సంస్థలకు ట్రాయ్‌ ఆదేశాలు

దిల్లీ: ఇబ్బందికరమైన కాల్స్‌, సందేశాల (ఎస్‌ఎమ్‌ఎస్‌) ముప్పును అరికట్టేందుకు వీలుగా ప్రచార కాల్స్‌, సందేశాలకు వినియోగదార్ల సమ్మతి తీసుకునేలా 2 నెలల్లోపు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలను టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్‌) ఆదేశించింది. ‘మొదటి దశలో ప్రచార కాల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌లు స్వీకరించడానికి వారి సమ్మతిని నమోదు చేసుకునే ప్రక్రియను సబ్‌స్క్రైబర్లు మాత్రమే ప్రారంభించగలరు. తర్వాత వ్యాపార సంస్థలు ప్రచార సందేశాలను స్వీకరించడానికి వారి సమ్మతిని పొందేందుకు వినియోగదార్లను సంప్రదించాల’ని శనివారం ట్రాయ్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సర్వీస్‌ ప్రొవైడర్లు, ప్రిన్సిపల్‌ ఎంటిటీల్లో వినియోగదార్ల సమ్మతిని డిజిటల్‌గా నమోదు చేసేందుకు డిజిటల్‌ సమ్మతి సేకరణ(డీసీఏ) సౌకర్యాన్ని అభివృద్ధి చేసి, అమలు చేయడానికి ఏకీకృత ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయాలని అన్ని యాక్సెస్‌ ప్రొవైడర్లకు ట్రాయ్‌ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రచార సందేశాలను పొందడానికి వినియోగదార్ల సమ్మతిని చూపించడానికి ఏకీకృత వ్యవస్థ లేదు. అందుకే 2 నెలల్లో దీన్ని అభివృద్ధి చేయాలని యాక్సెస్‌ ప్రొవైడర్లు అయిన టెలికాం సంస్థలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలకు ట్రాయ్‌ సూచించింది. సమ్మతి కోరుతూ పంపే సందేశాలు ‘127’తో మొదలయ్యేలా కామన్‌ షార్ట్‌ కోడ్‌ను వినియోగించాలని ఆయా సంస్థలను ఆదేశించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు