రాణిస్తున్న రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌

భారత్‌లో పైకప్పు (రూఫ్‌టాప్‌) సౌర సామర్థ్యం రాణిస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో 6.35 శాతం మేర వృద్ధితో 485 మెగావాట్లకు చేరిందని మెర్కామ్‌ ఇండియా పేర్కొంది.

Published : 04 Jun 2023 01:59 IST

జనవరి-మార్చిలో 6.35% వృద్ధితో 485 మె.వా.కు

దిల్లీ: భారత్‌లో పైకప్పు (రూఫ్‌టాప్‌) సౌర సామర్థ్యం రాణిస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో 6.35 శాతం మేర వృద్ధితో 485 మెగావాట్లకు చేరిందని మెర్కామ్‌ ఇండియా పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో ఇది 456 మెగావాట్లుగా ఉందని ఈ పరిశోధన సంస్థ శుక్రవారం ఒక నివేదికలో పేర్కొంది. త్రైమాసికం వారీగా అంటే 2022 అక్టోబరు-డిసెంబరుతో పోలిస్తే 483 మెగావాట్ల నుంచి 0.4 శాతం మేర పెరిగింది. జనవరి-మార్చి 2023 చివరకు మొత్తం రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ సామర్థ్యం 9.3 గిగావాట్లకు చేరింది.

నివాస వినియోగదార్లదే అధిక వాటా..

మెర్కామ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ జనవరి-మార్చిలో నివాస వినియోగదార్లే 58 శాతం వరకు సామర్థ్యాన్ని అందించారు. పరిశ్రమ, వాణిజ్య వినియోగదార్లు వరుసగా 28%, 14% చొప్పున వాటాను అందించగలిగారు. సమీక్షిస్తున్న త్రైమాసికంలో మొత్తం అందుబాటులోకి వచ్చిన సౌర విద్యుత్‌ సామర్థ్యంలో రూఫ్‌టాప్‌ సోలార్‌ వాటా 26 శాతంగా ఉంది.

గుజరాత్‌దే అగ్రస్థానం

‘2022లో హెచ్చుతగ్గుల అనంతరం.. ఇపుడ్‌ రూఫ్‌టాప్‌ విభాగంలో స్థిర వృద్ధి కనిపిస్తోంది. ఓ వైపు సోలార్‌ వ్యవస్థ వ్యయాలు తగ్గుతుండడం, మరో వైపు విద్యుత్‌ టారిఫ్‌ పెరుగుతుండడంతో.. వినియోగదార్లకు సౌర విద్యుత్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాబోయే త్రైమాసికాల్లో ఇది మంచి వృద్ధికి కారణమవుతుంద’ని మెర్కామ్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ సీఈఓ రాజ్‌ ప్రభు పేర్కొన్నారు. అక్టోబరు 2022 ముందు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టులు ఆలస్యమై.. ప్రస్తుతం ప్రారంభం అవుతుండడం కూడా వృద్ధికి దోహదం చేయొచ్చని అన్నారు. జనవరి-మార్చి 2023లో గుజరాత్‌, కేరళ, కర్ణాటకలోనే అత్యధికంగా రూఫ్‌టాప్‌ సామర్థ్యం జత అయింది. వీటి వాటా 70 శాతం వరకు ఉంది. దేశ మొత్తం రూఫ్‌టాప్‌ సామర్థ్యంలో గుజరాత్‌ వాటా 24 శాతంగా ఉండడం గమనార్హం. మహారాష్ట్ర, రాజస్థాన్‌లు తర్వాతి స్థానంలో ఉన్నాయి. తొలి 10 రాష్ట్రాలు 75 శాతం వాటాను అందిస్తుండడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని