ఫ్లెక్స్‌ స్పేస్‌కు పెరుగుతున్న ఆదరణ

భారతీయ కార్పొరేట్లు సౌకర్యవంతమైన కార్యాలయ స్థలాల(ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లేస్‌)పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Published : 04 Jun 2023 02:02 IST

వాటా పెంచుకుంటున్న కార్పొరేట్లు
ప్రస్తుతం 10-12 శాతానికి చేరిక
కరోనాకు ముందు 5-8 శాతమే
కొలియర్స్‌ నివేదిక

దిల్లీ: భారతీయ కార్పొరేట్లు సౌకర్యవంతమైన కార్యాలయ స్థలాల(ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ప్లేస్‌)పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్‌ పరిమాణాలకు ముందు 5-8 శాతంతో పోలిస్తే వీటి వాటా 10-12 శాతానికి చేరిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ కొలియర్స్‌ నివేదిక వెల్లడించింది. ‘గ్లోబల్‌ ఆక్యుపయ్యర్‌ అవుట్‌లుక్‌ 2023’ పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని చాలా కార్పొరేట్‌ సంస్థలు హైబ్రిడ్‌ పని నమూనాలోని సంక్లిష్టలతో కార్యాలయ స్థలాలను లీజుకు తీసుకోవడంపై నిర్ణయాలను వాయిదా వేస్తున్నాయని కొలియర్స్‌ పేర్కొంది. స్పష్టత లేకపోవడం, స్థూల ఆర్థిక అనిశ్చితులు.. తమ వ్యాపారాలకు కావల్సిన స్థలాలను అంచనా వేయడంలో సవాళ్లు విసురుతున్నాయని తెలిపింది. ఉద్యోగులు కోరుకుంటున్న సౌలభ్యాన్ని అందించడం, కార్యాలయంలోని తదుపరి పరిమాణం కోసం వారి పోర్ట్‌ఫోలియోలను పునఃసమీక్షించడం మధ్య సమతౌల్యాన్ని సాధించడంలో కంపెనీలు గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. అయితే భారతీయ కార్యాలయ స్థలాల ఆక్యుపయర్లు మాత్రం ఫ్లెక్స్‌ స్పేస్‌లకు సౌలభ్యం, వ్యయ ప్రభావం తదితర కారణాలతో వేగంగా ఆకర్షితులయ్యారని వివరించింది. కొవిడ్‌కు ముందు అంటే 2019లో 5-8 శాతం వాటా ఉన్న ఫ్లెక్స్‌ స్పేస్‌, 2023 నాటికి 10-12 శాతానికి చేరిందని నివేదికలో కొలియర్స్‌ వెల్లడించింది. భవిష్యత్తులోనూ ఫ్లెక్స్‌ స్పేస్‌లకు గిరాకీ పెరిగి, బలమైన వృద్ధి నమోదవుతుందని ఆఫీస్‌ సర్వీసెస్‌, ఇండియా ఎండీ పీయూశ్‌ జైన్‌ తెలిపారు. ఫ్లెక్స్‌ స్పేస్‌లను గతంలో 1-2 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకునేవారని, ఇప్పుడు దీర్ఘకాలిక పరిష్కారంగా 3-5 ఏళ్ల కాలానికి ఆక్యుపయ్యర్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 2022లో ఫ్లెక్‌ స్పేస్‌ ఆపరేటర్లు 6 నగరాల్లో 7 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకు తీసుకున్నారని వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని