కొత్త డిజైన్లకు అధిక గిరాకీ
గ్రానైట్, క్వార్ట్జ్ స్టోన్ ఉత్పత్తులు అందించే సంస్థ అయిన పోకర్ణ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 30 శాతం వరకూ ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) మిగులు ఉంటుందని అంచనా వేస్తోంది.
క్వార్ట్జ్ స్టోన్ ఉత్పత్తులపై పోకర్ణ విశ్లేషణ
ఈ ఆర్థిక సంవత్సరంలో 25- 30% ‘ఎబిటా’ మిగులు అంచనా
దేశీయ మార్కెట్‌పైనా దృష్టి
ఈనాడు - హైదరాబాద్
గ్రానైట్, క్వార్ట్జ్ స్టోన్ ఉత్పత్తులు అందించే సంస్థ అయిన పోకర్ణ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 30 శాతం వరకూ ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) మిగులు ఉంటుందని అంచనా వేస్తోంది. పోకర్ణ సీఈఓ పరస్ కుమార్ జైన్, ఇటీవల ఇన్వెస్టర్లతో నిర్వహించిన ‘కాన్ఫరెన్స్ కాల్’లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.728 కోట్ల ఆదాయంపై 25 శాతం ఎబిటా(రూ.181 కోట్లు) నమోదు చేసింది. వార్షిక నికర లాభం రూ.66 కోట్లు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభాల అంచనాలను సైతం ఆయన వెల్లడించారు. దీని ప్రకారం స్థూల లాభాల శాతం 40 నుంచి 45 శాతం వరకూ ఉంటుంది. పోకర్ణ లిమిటెడ్ ప్రధానంగా క్వార్ట్జ్ స్టోన్ ఉత్పత్తులను యూఎస్‌కు ఎగుమతి చేస్తోంది.
అమెరికా వినియోగదార్ల నుంచి ఆసక్తి
యూఎస్‌లో కొన్ని రాష్ట్రాల్లో అమ్మకాలు మెరుగుపడినట్లు, మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా సానుకూలత రాలేదని పరస్ కుమార్ జైన్ తెలిపారు. అదే సమయంలో కొత్త క్వార్ట్జ్ స్టోన్ డిజైన్లపై యూఎస్‌లోని వినియోగదార్లలో ఆసక్తి వ్యక్తమవుతోందని అన్నారు. ‘మా దగ్గర దాదాపు 10,000 డిజైన్లు ఉన్నాయి. గత ఆరు నెలల్లో 20కి పైగా డిజైన్లను యూఎస్‌లో ప్రవేశపెట్టాం. దీనిపై అక్కడి వినియోగదార్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. కొత్త డిజైన్లపై లాభాలు కూడా అధికంగా ఉంటాయన్నారు. దాదాపు 15 శాతం అమ్మకాలు కొత్త డిజైన్ల నుంచి లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే కొన్నేళ్లలో ఇది ఇంకా పెరుగుతుందని అన్నారు.
ఇతర దేశాల్లో అమ్మకాలపై దృష్టి: యూఎస్ వెలుపల అమ్మకాలను పెంచుకోవడం ఎలా...? అనే అంశంపై ఇటీవల కాలంలో పోకర్ణ లిమిటెడ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్, మెక్సికో, రష్యా, కెనడా దేశాల్లో మార్కెటింగ్ కార్యకలాపాలు చేపట్టింది. వచ్చే ఏడాది కాలంలో ఈ దేశాల్లో అమ్మకాలు పెంచుకునే అవకాశం ఉందని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. తమ వార్షిక అమ్మకాల్లో 7- 9 శాతం ఈ కొత్త మార్కెట్ల నుంచి నమోదు కావచ్చు అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. రష్యాకు ఐరోపా దేశాల నుంచి ఎగుమతులపై ఆంక్షలు ఉన్నందున, మన దేశం నుంచి అధికంగా ఎగుమతి చేసే అవకాశం ఉంది కదా? అనే ప్రశ్నకు బదులిస్తూ, రష్యాకు నేరుగా రవాణా సౌకర్యం లేకపోవటం వల్ల వేగంగా తమ ఉత్పత్తులను పంపించలేని పరిస్థితి ఉందని జైన్ వివరించారు. ఏదేమైనా ఈ కొత్త మార్కెట్లలో వచ్చే ఏడాది నాటికి తమ అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
దేశీయ మార్కెట్‌పైనా..: దేశీయ మార్కెట్‌పైనా పోకర్ణ దృష్టి కేంద్రీకరిస్తోంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే కొన్ని పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు క్వార్ట్జ్ స్టోన్ ఉత్పత్తులు సరఫరా చేస్తున్నట్లు, మున్ముందు ఇంకా ఎక్కువ అమ్మకాలు నమోదు చేసే అవకాశం దేశీయ మార్కెట్లో తమకు కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. వార్షిక అమ్మకాల్లో దేశీయ మార్కెట్ వాటా కనీసం 10 శాతం ఉండాలని తాము ఆశిస్తున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటే, అందులో దేశీయ మార్కెట్ వాటా రూ.100 కోట్లు అయినా ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం తమకు ఉన్న ఉత్పత్తి సామర్థ్యంలో 50- 60 శాతాన్ని వినియోగించుకుంటున్నట్లు, త్వరలో ఇది 65 శాతానికి పెరుగుతుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా.. ప్రజల్లోకి కల్పిత ఫోన్ సంభాషణల రికార్డింగ్
-
మానవత్వమా.. నువ్వెక్కడ?
-
మా జగన్నే తిడతావా అంటూ యువకుణ్ని కుళ్లబొడిచిన దుండగులు
-
విజిల్స్ వేశారని కేసా? పిలిచి విచారిస్తారా?: లోకేశ్
-
నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది: నారా భువనేశ్వరి భావోద్వేగం
-
భద్రాద్రి అన్నదాన సత్రంలో ఒకేసారి వెయ్యిమంది భోజనానికి ఏర్పాట్లు