2023-24లో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో చాలా కీలక రంగాల్లో సామర్థ్య వినియోగం ఇప్పటికే 80 శాతం అధిగమించిందని కొత్తగా ఎన్నికైన సీఐఐ అధ్యక్షుడు ఆర్‌.దినేశ్‌ ఆదివారం వెల్లడించారు.

Published : 05 Jun 2023 03:01 IST

సీఐఐ అధ్యక్షుడు ఆర్‌.దినేశ్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో చాలా కీలక రంగాల్లో సామర్థ్య వినియోగం ఇప్పటికే 80 శాతం అధిగమించిందని కొత్తగా ఎన్నికైన సీఐఐ అధ్యక్షుడు ఆర్‌.దినేశ్‌ ఆదివారం వెల్లడించారు. ఆర్థిక వృద్ధి కూడా 6.7 శాతం నమోదు కావొచ్చని అంచనాలున్నందున ప్రైవేటు రంగ పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేశారు. అలాగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2016-19 మధ్య కాలంలో వృద్ధికి సరైన అవకాశాలు లేనందున, 2020లో కొవిడ్‌ రావడంతో ప్రైవేటు కంపెనీలతో పెట్టుబడులు పెట్టించడంలో ప్రభుత్వం విజయవంతం కాలేదని ఆయన వెల్లడించారు. గిరాకీకి ఆటంకం కలిగించే పరిస్థితుల్ని నియంత్రించేందుకు మాకు కొన్ని పరిమితులున్నా, చాలా వేగంగా కొవిడ్‌ నుంచి బయటపడగలిగామని వివరించారు.

గత ఏడాది రూ.25.7 లక్షల  కోట్లు వచ్చాయ్‌

సీఐఐ వార్షిక సీఈఓల సర్వేను ఉటంకిస్తూ, అన్ని రంగాలు 75 శాతం సామర్థ్య వినియోగాన్ని అధిగమించాయని తెలిపారు. సిమెంటు, ఉక్కు, రసాయనాలు, యంత్రాలు వంటి కీలక రంగాల్లో ఇది 80 శాతాన్ని దాటిందని పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో మూలధన పెట్టుబడుల (క్యాపెక్స్‌) గణనీయ పెరుగుదల దశలో ఉన్నామన్నారు. సీఎంఐఈ డేటా ఇన్వెస్ట్‌మెంట్‌ కమిట్‌మెంట్‌ ప్రకారం, గత ఏడాది రూ.25.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అంత క్రితం ఏడాది ఈ పెట్టుబడులు రూ.14.3 లక్షల కోట్లుగా ఉన్నాయని వివరించారు. విదేశీ మదుపర్లు భారత్‌పై విశ్వాసం చూపిస్తున్నప్పటికీ, తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకోవడం ఏమిటనే విషయాన్ని పరిశ్రమ నుంచి తెలుసుకోవాలని గత ఏడాది సెప్టెంబరులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రయత్నించారని తెలిపారు. దేశీయ పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు అవసరమైన విధానపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలో ఆమె హామీ ఇచ్చారని వెల్లడించారు.


ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు!
విశ్లేషకుల అంచనా

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం నుంచి 3 రోజుల పాటు నిర్వహించబోయే ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికే అదుపులోకి రావడంతో పాటు భవిష్యత్‌లో మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉండటంతో రేట్ల పెంపు జోలికి ఆర్‌బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నెల 6-8 తేదీల్లో జరిగే 43వ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను గురువారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించనున్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన ఎంపీసీ సమావేశంలోనూ రేట్లను పెంచని సంగతి తెలిసిందే. అంతకు ముందు 2022 మే నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.5 శాతానికి చేర్చింది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేటును పెంచుతూ పోయింది. ఈ చర్యలు ఫలించి గత ఏప్రిల్‌లో వినియోగదారు ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి తగ్గింది. మే నెలకు సంబంధిన రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ నెల 12న వెల్లడవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని