63,000 ఎగువన కొత్త గరిష్ఠాలకు!

సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సానుకూల ఆర్థిక గణాంకాలు, చమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి.

Published : 05 Jun 2023 05:21 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సానుకూల ఆర్థిక గణాంకాలు, చమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. దేశీయంగా చూస్తే.. 2022-23 మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ 6.1 శాతం వృద్ధి చెందగా.. మొత్తం వార్షిక వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైంది. ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.17.33 లక్షల కోట్లకు తగ్గింది. మేలో తయారీ పీఎంఐ 31 నెలల గరిష్ఠమైన 58.7 పాయింట్లుగా నమోదైంది. జీఎస్‌టీ వసూళ్లు 12% వృద్ధితో రూ.1.57 లక్షల కోట్లకు చేరాయి. వాహన కంపెనీలు గత నెలలో మంచి అమ్మకాలు నమోదు చేశాయి. బ్యారెల్‌ ముడిచమురు 1.8% తగ్గి 75.7 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.71 నుంచి 82.31కు బలపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా పారిశ్రామికోత్పత్తి వరుసగా రెండో నెలా తగ్గింది. అమెరికా రుణ పరిమితి పెంచే బిల్లుకు సెనేట్‌ ఆమోదం లభించడంతో మార్కెట్లకు ఉపశమనం లభించింది.  మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.1 శాతం లాభంతో 62,547 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.2% పెరిగి 18,534 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ లాభపడగా.. చమురు-గ్యాస్‌, విద్యుత్‌, బ్యాంకింగ్‌ నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.6,520 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1,043 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మేలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.43,838 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గతేడాది ఆగస్టులో రూ.51,204 కోట్ల పెట్టుబడుల తర్వాత ఇదే అత్యధికం.


లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 3:2గా నమోదు కావడం..
ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గరిష్ఠ స్థాయుల్లో స్థిరీకరణ జరగడంతో గతవారం సెన్సెక్స్‌ స్తబ్దుగా ముగిసింది. సెన్సెక్స్‌ 61,500 పాయింట్ల ఎగువన కొనసాగినంత వరకు సానుకూల ధోరణిలోనే కదలాడొచ్చు. స్వల్పకాలంలో 63,000 పాయింట్ల పైన ముగిస్తే.. 63,600 పాయింట్ల దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని పరీక్షించొచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాల నుంచి దేశీయ సూచీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. 8న ఆర్‌బీఐ ప్రకటించనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు. స్వల్పకాంలో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించొచ్చు. దేశీయంగా చూస్తే.. మే భారత సేవల పీఎంఐ, ఏప్రిల్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. రుతుపవనాలకు సంబంధించిన వార్తలపై మార్కెట్లు దృష్టి పెట్టొచ్చు. వర్షాలు ఆలస్యం కావడం, ఎల్‌నినో వంటివి సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు.

అంతర్జాతీయంగా చూస్తే.. ఎస్‌ అండ్‌ పీ సేవల పీఎంఐ గణాంకాలు, ఆస్ట్రేలియా, కెనడా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రకటించనున్నాయి. చైనా, అమెరికా వాణిజ్య గణాంకాలపై కన్నేయొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. ఒపెక్‌+ సమావేశ నిర్ణయాలు స్వల్పకాలంలో ప్రభావం చూపనున్నాయి. ఉత్పత్తి కోతల వల్ల చమురు ధరలు పెరిగితే సెంటిమెంట్‌ దెబ్బతినే అవకాశం ఉంది.


తక్షణ మద్దతు స్థాయులు: 61,872, 61,484, 61,000

తక్షణ నిరోధ స్థాయులు: 63,036, 63,583, 64,200

సెన్సెక్స్‌ 63,000 ఎగువన జీవనకాల గరిష్ఠాలను తాకొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు