అంకురాలకు పూర్తి మద్దతిస్తాం

దేశ ఆర్థికాభివృద్ధిలో అంకురాలు కీలక భూమిక పోషిస్తున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా అన్నారు.

Updated : 06 Jun 2023 02:59 IST

ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా
హైదరాబాద్‌లో స్టార్టప్‌ల కోసం ప్రత్యేక శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: దేశ ఆర్థికాభివృద్ధిలో అంకురాలు కీలక భూమిక పోషిస్తున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ ఖరా అన్నారు. ప్రపంచంలో ఆవిష్కరణల కేంద్రంగా భారత్‌ మారుతోందని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో అంకురాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఎస్‌బీఐ స్పెషలైజ్డ్‌ స్టార్టప్‌ హబ్‌’ శాఖను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. గత ఆగస్టులో తొలి స్టార్టప్‌ హబ్‌ ప్రారంభించినప్పుడు, ఏడాదిలో దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు శాఖలను ఏర్పాటు చేయాలనే లక్ష్యం విధించుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా అయిదో శాఖను ఇక్కడ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అంకురాలకు అవసరమైన బ్యాంకింగ్‌ సేవలు మొదలు, విదేశీ పెట్టుబడులు తదితర అన్ని రకాల సమగ్ర సేవలనూ ఇక్కడి నుంచి అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం గ్రూపులోని అన్ని అనుబంధ సంస్థలూ కలిసి పనిచేస్తాయని తెలిపారు. అంకురాలకు మద్దతివ్వడంలో ఎస్‌బీఐ ముందుంటుందని పేర్కొన్నారు. పెద్ద సంస్థలు అన్ని పనులూ సొంతంగా చేసుకోలేవు. అందుకే, అవి వినూత్న ఆవిష్కరణల కోసం అంకురాలపై ఆధారపడతాయని తెలిపారు. ఈ అవకాశాలను అంకుర సంస్థలు అందుకోవాలి. సమస్యలను సరికొత్త ఆలోచనలతో పరిష్కరించేలా చూడాలి అని సూచించారు.

పెట్టుబడులకు ఇబ్బంది లేదు..

‘దేశంలో 108 యూనికార్న్‌లు ఉన్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. ప్రపంచంలో మూడో అంకుర వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోంది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభం వచ్చినప్పుడు స్టార్టప్‌లకు పెట్టుబడుల సమస్య వస్తుందని భావించారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పెట్టుబడులు వస్తాయి. వాటిని ఆకర్షించే సత్తా దేశీయ అంకురాలకు ఉంది. అందుకే విదేశీ సంస్థాగత సంస్థలు, వెంచర్‌ క్యాపిటలిస్టులు ఇక్కడి అంకురాలకు నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు’ అని దినేశ్‌ ఖరా అన్నారు. ఎస్‌బీఐ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌తోపాటు ఇతర అనుబంధ సంస్థలు పెట్టుబడిదారులకూ, అంకురాలకు మధ్య వారధిలా పనిచేస్తాయని పేర్కొన్నారు. నిధులు, పెట్టుబడుల నిర్వహణలోనూ ఎస్‌బీఐ స్టార్టప్‌ హబ్‌ నుంచి ప్రత్యేక సేవలు అందుతాయని తెలిపారు. అంకురాలను ప్రోత్సహించేందుకు ఐఐఐటీహెచ్‌ లాంటి ఇంక్యుబేటర్లతోపాటు, ఎఫ్‌టీసీసీఐతోనూ కలిసి పనిచేస్తున్నామన్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి రూ.50 లక్షల విరాళాన్ని, ఆదర్శ స్వచ్ఛంద సంస్థకు మారుతీ ఈకో వాహనాన్ని దినేశ్‌ ఖరా అందించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు