అద్భుత విపణే కానీ.. పన్నులే ఎక్కువ
విమానయాన రంగానికి భారత్‌లో అద్భుత అవకాశాలు ఉన్నప్పటికీ.. కార్యకలాపాల నిర్వహణ వ్యయంతో కూడుకున్నదని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ అభిప్రాయపడ్డారు.
భారత విమానయానంపై ఐఏటీఐ డైరెక్టర్ జనరల్ వాల్ష్
దిల్లీ: విమానయాన రంగానికి భారత్‌లో అద్భుత అవకాశాలు ఉన్నప్పటికీ.. కార్యకలాపాల నిర్వహణ వ్యయంతో కూడుకున్నదని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ రంగంపై పన్నులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. భారత విపణి ఆకర్షణీయం కనుకే, ఇక్కడి విమానాశ్రయాల్లోకి పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. భారత విమానయాన రంగంలో, ప్రస్తుత పరిస్థితుల్లో రెండు సంస్థలకే ఆధిపత్యం ఉండబోతోందా అన్న ప్రశ్నకు వాల్ష్ సమాధానమిస్తూ.. ఇతర సంస్థలు కూడా పోటీపడేందుకు అపార అవకాశాలు భారత విపణిలో ఉన్నాయని తెలిపారు.
ద్వైపాక్షిక హక్కులు పెంచాలి
భారత్‌కు మరిన్ని విమాన సర్వీసులను నడిపేందుకు వీలుగా ద్వైపాక్షిక విమానయాన హక్కులను పెంచాలని గల్ఫ్ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రెసిడెంట్ సర్ టిమ్ క్లార్క్ అన్నారు. 2015 నుంచి భారత్‌లో తమ గ్రూప్ విమాన సీట్ల సంఖ్యను పెంచలేదని తెలిపారు. ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన విపణుల్లో భారత్ కూడా ఒకటి. అందుకే గల్ఫ్ విమానయాన సంస్థలు భారత్‌కు మరిన్ని విమానాలు నడపాలని అనుకుంటున్నాయి. అయితే ద్వైపాక్షిక విమానయాన హక్కులను పెంచేందుకు ప్రభుత్వం అనుకూలంగా లేదు. ప్రస్తుతం ప్రతి వారం దుబాయ్ నుంచి భారత్‌కు ఒక వైపునకు 65,000 సీట్లను మాత్రమే ఎమిరేట్స్ నిర్వహించేందుకు వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.