కీలక రేట్లు యథాతథామేనా!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది.

Published : 07 Jun 2023 03:07 IST

 ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం
రేపు నిర్ణయాల వెల్లడి

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈసారి కూడా కీలక రేట్లను యథాతథంగా ఉంచొచ్చనే అభిప్రాయాన్ని చాలా మంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందనే భావనతోనే కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయక పోవచ్చని చెబుతున్నారు. ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురువారం (8వ తేదీన) వెల్లడిస్తారు. గత ఏప్రిల్‌ సమావేశంలో రెపో రేటును ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగివచ్చినందున.. ఈసారి కీలక రేట్లలో మార్పులు చేయకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ‘ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆందోళన కొనసాగుతున్నందున.. కీలక రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా వృద్ధి నెమ్మదిస్తున్నందున, ఆ ప్రభావం భారత్‌పైనా ఉంటుందని.. దీనిని ఎదుర్కోవడమే ముఖ్యమ’ని డెలాయిట్‌ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్‌ తెలిపారు. ద్రవ్యోల్బణంపై ఆందోళన తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయకపోవచ్చని హౌసింగ్‌ డాట్‌కామ్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాలా తెలిపారు. ‘వృద్ధికి ఊతమిచ్చేందుకు కీలక రేట్లను తగ్గించాలనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఆ నిర్ణయాన్ని తీసుకునేందుకు  ఆర్‌బీఐ ఆచితూచి అడుగు వేసే అవకాశం ఉంద’ని ఆయన విశ్లేషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని