ప్రతి నగరంలో విద్యుత్‌ బస్సులు!

దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను ఆవిష్కరించే విధానాలతో కేంద్రప్రభుత్వం ముందుకు రానుంది.

Published : 07 Jun 2023 03:23 IST

ప్రజా రవాణాపై త్వరలో నూతన విధానం

దిల్లీ: దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను ఆవిష్కరించే విధానాలతో కేంద్రప్రభుత్వం ముందుకు రానుంది. ఇందులో విద్యుత్‌ వాహన (ఈవీ) పరిశ్రమకు ‘అతిపెద్ద’ మద్దతు లభిస్తుందని ప్రధాన మంత్రి సలహాదారు తరుణ్‌ కపూర్‌ అంచనా వేశారు. దేశంలోని చాలా వరకు  నగరాల్లో ప్రజా రవాణా లేదన్న విశ్లేషణను ఆయన గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో డీజిల్‌ బస్సులను కాకుండా.. విద్యుత్‌ వాహనాల ద్వారా ప్రజావసరాలు తీర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన అన్నారు. ‘వాహనాల ధరలతో పాటు బ్యాటరీ పరిమాణం తగ్గించడంపై ఈవీ పరిశ్రమ దృష్టి సారించాలి. స్కాండినేవియా, ఐరోపా దేశాల్లో ఈవీలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. మనదేశం కూడా ఈ దిశగా కొనసాగాల’ని కపూర్‌ పేర్కొన్నారు. మనదేశం తన ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి ద్వారానే పొందుతోంది. సహజ వాయువును సైతం 50 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటోందని గుర్తు చేశారు. ‘ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారక నగరాలు మన దేశంలో ఉన్నాయి. కాలుష్య ఉద్గారాలు తగ్గించుకునేందుకు ఈవీలను అందిపుచ్చుకోవడం మినహా ఇంకో ప్రత్యామ్నాయం లేదు. విద్యుత్తు కార్లే కాకుండా.. బ్యాటరీతో నడిచే బస్సులు, ద్విచక్రవాహనాలే రోడ్లపై తిరిగేలా చూసుకోవాలి. ప్రపంచంలోనే ఈవీలకు తయారీ కేంద్రంగా మనదేశం మారాల్సిన అవసరం ఉంద’ని కపూర్‌ అన్నారు. ‘వచ్చే 5-7 ఏళ్లలో రోడ్లపై 100 శాతం విద్యుత్తు ద్విచక్ర వాహనాలు కనిపించేందుకు అవకాశం ఉంది. ఇది పెట్రోలు వినియోగాన్ని తగ్గించుకోవడంలో ఉపయోగపడుతుంది. మనదేశం అతిపెద్ద మార్కెట్‌. ఒక స్థాయికి మించి నేరుగా ప్రభుత్వ సబ్సిడీని ఈవీ రంగానికి ఇవ్వలేద’ని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇటీవలే విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై ఇస్తున్న సబ్సిడీలో కోత విధించిన సంగతి తెలిసిందే. తదనంతరం పలు కంపెనీలు ఇ-స్కూటర్ల రేట్లను పెంచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని