నోరిష్కో పోర్ట్‌ఫోలియో ఆదాయ లక్ష్యం రూ.1,000 కోట్లు: టాటా కన్జూమర్‌

నోరిష్కో విభాగం కింద నాన్‌-కార్బొనేటెడ్‌, రెడీ-టు-డ్రింక్‌ పానీయాల నుంచి 83% ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ వెల్లడించింది.

Published : 07 Jun 2023 03:23 IST

కోల్‌కతా: నోరిష్కో విభాగం కింద నాన్‌-కార్బొనేటెడ్‌, రెడీ-టు-డ్రింక్‌ పానీయాల నుంచి 83% ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ వెల్లడించింది. ఈ విభాగం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో    రూ.1,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలనుకుంటున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ మంగళవారం తెలిపారు. ఆహార బ్రాండ్లు టాటా సంపన్న్‌, టాటా సోల్‌ఫుల్‌లతో కూడిన నోరిష్కో విభాగ ఆదాయం కంపెనీ వార్షికాదాయంలో 15 శాతంగా ఉంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నౌరిష్కో పోర్ట్‌ఫోలియోతో కలిపి ఆదాయ వృద్ధి 80 శాతం వరకు పెరిగి రూ.620 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ భారత వ్యాపారం సుమారు 10% పెరిగి రూ.8,720 కోట్లుగా నమోదైంది. కంపెనీ టీ వ్యాపారం వాటా ఏకీకృత ఆదాయంలో 47% కాగా, కాఫీ వ్యాపార వాటా 11 శాతంగా ఉంది. గతంలో వచ్చిన నష్టాల్ని వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో తుడిచిపెడతామని టాటా కన్జూమర్‌ 60వ వార్షిక సాధారణ సమావేశంలో చంద్రశేఖరన్‌ వెల్లడించారు.

* 2022-23 వార్షిక నివేదిక ప్రకారం, నోరిష్కో విభాగ ఉత్పత్తుల పంపిణీని పెంచడం, అధిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా మొత్తం వ్యాపారంలో 13 శాతానికి చేరింది. నోరిష్కో కింద టాటా కాపర్‌+ బ్రాండ్‌పై కాపర్‌ ట్రీటెడ్‌ నీళ్లను సంస్థ విక్రయిస్తోంది. ఈ విభాగం గణనీయ వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ సునీల్‌ డిసౌజా తెలిపారు. హిమాలయన్‌ బ్రాండ్‌ కింద విక్రయిస్తున్న ప్రీమియం ప్యాకేజ్డ్‌ వాటర్‌ కూడా లాభాల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. తేనె, ఇతర ప్రీమియం ప్రిజర్వ్స్‌ వంటి తినదగిన ఉత్పత్తులకు విస్తరించడానికి కంపెనీ ఈ బ్రాండ్‌ను నోరిష్కో పోర్ట్‌ఫోలియో కింద నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని