రోజంతా ఒడుదొడుకులే

ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. వాహన, పరిశ్రమలు, కమొడిటీ షేర్లకు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది

Published : 07 Jun 2023 03:31 IST

సమీక్ష


ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. వాహన, పరిశ్రమలు, కమొడిటీ షేర్లకు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా సమీక్షలో వడ్డీ రేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే భావనతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 82.60 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.84% నష్టపోయి 75.33 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో లాభపడగా, షాంఘై, హాంకాంగ్‌ నష్టపోయాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
* సెన్సెక్స్‌ ఉదయం 62,738.35 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కదలాడిన సూచీ ఒకదశలో 62,554.21 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. ఆఖర్లో కోలుకున్న సూచీ లాభాల్లోకి వచ్చి 5.41 పాయింట్లు పెరిగి 62,792.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.15 పాయింట్ల లాభంతో 18,599 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,531.60- 18,622.75 పాయింట్ల మధ్య కదలాడింది.

* 2.65 బిలియన్‌ డాలర్ల రుణాలను ముందుగానే తిరిగి చెల్లించినట్లు ప్రకటించడంతో అదానీ గ్రూప్‌లోని 10 షేర్లలో 5 లాభాలు నమోదు చేశాయి. అంబుజా సిమెంట్స్‌ 4.54%, ఏసీసీ 2.47%, అదానీ పవర్‌ 1.37%, అదానీ పోర్ట్స్‌ 0.89%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 0.51% మెరిశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 1.55%, ఎన్‌డీటీవీ 0.96%, అదానీ విల్మర్‌ 0.60%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 0.45%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 0.01% నష్టపోయాయి.
సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 పెరిగాయి. అల్ట్రాటెక్‌ 2.93%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.90%, కోటక్‌ బ్యాంక్‌   1.88%, టాటా మోటార్స్‌ 1.68%, మారుతీ 1.57%, ఎంఅండ్‌ఎం 1.14%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.12%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.09% చొప్పున లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా 2.11%, ఇన్ఫోసిస్‌ 1.98%, టీసీఎస్‌     1.69%, విప్రో 1.09%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.82% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ 1.66%, టెక్‌ 1.51%, లోహ 0.45%, చమురు-గ్యాస్‌ 0.08% నీరసపడ్డాయి. స్థిరాస్తి, వాహన, కమొడిటీస్‌, యంత్ర పరికరాలు, ఆరోగ్య సంరక్షణ రాణించాయి. బీఎస్‌ఈలో 1924 షేర్లు లాభపడగా, 1611 స్క్రిప్‌లు నష్టపోయాయి. 124 షేర్లలో ఎటువంటి మార్పులేదు.

* బ్యాంక్‌ నిఫ్టీ ఎఫ్‌అండ్‌ఓ ముగింపు.. ఇకపై శుక్రవారం: బ్యాంక్‌ నిఫ్టీ ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) గడువు ముగింపును గురువారం నుంచి శుక్రవారానికి మారుస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. జులై 14 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రస్తుతం నడుస్తున్న కాంట్రాక్టులను ఇందుకు అనుగుణంగా మార్చనున్నారు. జులై 6న చివరిసారిగా గురువారం నాడు బ్యాంక్‌ నిఫ్టీ కాంట్రాక్టుల ముగింపు ఉంటుంది. శుక్రవారం ట్రేడింగ్‌ సెలవు ఉంటే.. ముందు రోజే కాంట్రాక్టుల ముగింపు ఉంటుందని ఎన్‌ఎస్‌ఈ స్పష్టం చేసింది.

* శుక్రవారం వరకు గోఫస్ట్‌ విమానాల రద్దు: నిర్వహణ ఇబ్బందులతో 9 వరకు విమానాల రద్దు పొడిగిస్తున్నట్లు గోఫస్ట్‌ వెల్లడించింది. టికెట్లు బుక్‌ చేసుకున్న వినియోగదారులకు రిఫండ్‌ ఇవ్వనుంది.
* మానవ వనరులు, సిబ్బంది సేవల సంస్థ సెక్ట్రమ్‌ ట్యాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఐపీఓ ఈ నెల 9న ప్రారంభమై 14న ముగియనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.169-173గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.105.14 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ఇష్యూలో భాగంగా 51.85 లక్షల తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 8.92 లక్షల షేర్లను కంపెనీ విక్రయించనుంది.
* ఐకియో లైటింగ్‌ ఐపీఓకు మొదటి రోజున1.55 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,52,24,074 షేర్లు జారీ చేయనుండగా.. 2,36,67,020 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని