2030 కల్లా రూ.82 లక్షల కోట్లకు భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ
భారత ఇంటర్నెట్ ఆధారిత (డిజిటల్) ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 కల్లా 6 రెట్లు పెరిగి లక్ష కోట్ల డాలర్లకు (రూ.82 లక్షల కోట్లకు పైగా) చేరే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది.
గూగుల్, టెమాసెక్, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక
దిల్లీ: భారత ఇంటర్నెట్ ఆధారిత (డిజిటల్) ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 కల్లా 6 రెట్లు పెరిగి లక్ష కోట్ల డాలర్లకు (రూ.82 లక్షల కోట్లకు పైగా) చేరే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఇ-కామర్స్ రంగం ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. గూగుల్, టెమాసెక్, బెయిన్ అండ్ కంపెనీలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.
ఈ రంగాలది కీలక పాత్ర
2022లో భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 155-175 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12.71-14.35 లక్షల కోట్ల) శ్రేణిలో ఉందని నివేదిక అంచనా వేసింది.
* ఈ రంగ వృద్ధిలో బీ2సీ (వ్యాపార సంస్థలు- వినియోగదారుల) ఇ-కామర్స్ రంగానిది ప్రధాన భూమిక కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో బీ2బీ (వ్యాపార సంస్థల మధ్య) ఇ-కామర్స్, సాస్ (సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్) సంస్థలు, ఆన్‌లైన్ మీడియా (ఓటీటీ సంస్థలు) ఉంటాయని నివేదిక వివరించింది. భవిష్యత్తులో అధిక కొనుగోళ్లు డిజిటల్ రూపేణా జరుగుతాయనే అంచనాను గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా వ్యక్తం చేశారు. డిజిటల్ ఆవిష్కరణలకు తొలుత అంకుర సంస్థలు అడుగులు వేయగా, కొవిడ్-19 పరిణామాల అనంతరం పోటీ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు చిన్న - మధ్య తరహా- పెద్ద సంస్థలు కూడా డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయని వివరించారు. ఈ నివేదిక ప్రకారం..
* బీ2సీ ఇ-కామర్స్ రంగం 2030 కల్లా 5-6 రెట్లు పెరిగి 350-380 బి.డాలర్ల (రూ.28.70- 31.16 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉంది. 2022లో ఇది 60-65 బి.డాలర్లు (రూ.4.92-5.33 లక్షల కోట్లు)గా ఉంది.
* బీ2బీ ఇ-కామర్స్ రంగం కూడా 2030 నాటికి 13-14 రెట్ల వృద్ధితో 105-120 బి.డాలర్ల (సుమారు రూ.8.61-9.84 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉంది. 2022లో ఇది సుమారు 8-9 బి.డాలర్లు (సుమారు రూ.65,600-73,800 కోట్లు).
*సాస్ విభాగం 2022లోని 12-13 బి.డాలర్ల (రూ.98,400-1,06,600 కోట్ల) నుంచి 65-75 బి.డాలర్ల (రూ.5.33-6.15 లక్షల కోట్ల)కు చేరొచ్చు.
* దేశ జీడీపీలో ఇంటర్నెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వాటా 2022లో 4-5 శాతంగా ఉండగా.. 2030కి 12-13 శాతానికి చేరే అవకాశం ఉంది.
* అంతర్జాతీయ జీడీపీ వృద్ధికి ప్రస్తుతం భారత్ ఒక కొత్త ఆశాకిరణంగా అవతరించిందని టెమాసెక్ మేనేజింగ్ డైరెక్టర్ (పెట్టుబడులు) విశేష్ శ్రీవాస్తవ అన్నారు.
* అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరించేందుకు భారత్‌కు చెందిన విద్యాసాంకేతిక (ఎడ్యుటెక్) సంస్థలకు తగినన్ని అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.