దేశీయ విపణిపై నాట్కో ఫార్మా దృష్టి

దేశీయ ఔషధాల విపణిలో విస్తరించే యత్నాల్లో భాగంగా, ఏదైనా ఒక చిన్న ఔషధ కంపెనీని కొనుగోలు చేసేందుకు నాట్కో ఫార్మా సన్నద్ధమవుతోంది.

Published : 07 Jun 2023 03:36 IST

ఈ ఏడాదిలో ఒక కంపెనీ కొనుగోలుకు కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయ ఔషధాల విపణిలో విస్తరించే యత్నాల్లో భాగంగా, ఏదైనా ఒక చిన్న ఔషధ కంపెనీని కొనుగోలు చేసేందుకు నాట్కో ఫార్మా సన్నద్ధమవుతోంది. ఈ వ్యవహారంపై కొంతకాలంగా కసరత్తు చేస్తున్న నాట్కో యాజమాన్యం.. ఈ ఏడాదిలో దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ‘మా చేతిలో నగదు నిల్వలున్నాయి. అందువల్ల ఏదైనా ఒక చిన్న కంపెనీని కొనుగోలు చేయడం మాకు కష్టం కాదు’ అని నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్‌ నన్నపనేని ఇటీవల ఇన్వెస్టర్లతో నిర్వహించిన ‘కాన్ఫరెన్స్‌ కాల్‌’ లో వివరించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ చేతిలో  రూ.1,089 కోట్ల నగదు ఉండగా, కంపెనీకి ఉన్న అప్పు రూ.70 కోట్లేనని తెలిపారు. కొన్నేళ్లుగా దేశీయ మార్కెట్‌లో నాట్కో ఫార్మా తక్కువ ఆదాయాలు నమోదు చేస్తోంది. దేశీయంగా అమ్మకాలు పెంచుకోవాలని, తద్వారా స్థిరమైన ఆదాయాలు నమోదు చేసే స్థాయికి చేరుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. దీనికోసం తనకు తానుగా అమ్మకాలు పెంచుకోవడంతో పాటు, ఇతర సంస్థల కొనుగోలు ద్వారా (ఇన్‌-ఆర్గానిక్‌) వృద్ధి అవకాశాలను పరిశీలిస్తోంది. తన వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉండే కంపెనీని కొనుగోలు చేయాలని భావిస్తోంది.

వ్యవసాయ రసాయనాల నుంచి 10% టర్నోవర్‌

వ్యవసాయ రసాయనాల (అగ్రికెమికల్స్‌) విభాగంలోకి అడుగుపెట్టిన నాట్కో ఫార్మా సీటీపీఆర్‌ ఆధారిత ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. వచ్చే ఖరీఫ్‌ సీజన్లో ఈ విభాగం మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.41 కోట్ల అమ్మకాలను ఈ విభాగం నమోదు చేసింది. ఇందులో మార్చి త్రైమాసికంలోనే రూ.27 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వచ్చే కొన్నేళ్లలో కంపెనీ వార్షిక టర్నోవర్‌లో అగ్రికెమికల్స్‌ వాటా 10 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు రాజీవ్‌ వెల్లడించారు. ఈ విభాగంలో కొన్ని రసాయనాలను త్వరలో మార్కెట్లో ప్రవేశపెడతామని తెలిపారు.

పరిశోధనలకు రూ.300 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు రూ.300 కోట్లు ఖర్చు చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ మొత్తం అధికం. తద్వారా విదేశీ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లో నూతన ఔషధాలను విడుదల చేసేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.

అమెరికాకు కొత్త ఔషధాలు

అమెరికాలో గత ఏడాదిలో డాష్‌ ఫార్మా అనే సంస్థను నాట్కో ఫార్మా కొనుగోలు చేసింది. ఆ సంస్థ ద్వారా అమెరికాలో కొన్ని కొత్త ఔషధాలు విడుదల చేయనున్నట్లు రాజీవ్‌ తెలిపారు. ఇందులో కొన్ని ఎఫ్‌టీఎఫ్‌ (ఫస్ట్‌-టు-ఫైల్‌) ఔషధాలు ఉంటాయని అంచనా. కెనడా, బ్రెజిల్‌లో కూడా తన అనుబంధ కంపెనీల ద్వారా కొత్త ఔషధాలు విడుదల చేసే అవకాశాన్ని నాట్కో ఫార్మా పరిశీలిస్తోంది. అమెరికాలో ‘రెవ్లీమిడ్‌’ ఔషధ అమ్మకాలతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆకర్షణీయ లాభాలను ఈ కంపెనీ నమోదు చేసింది. మరికొన్ని త్రైమాసికాల పాటు ఇదే స్థితి కొనసాగొచ్చని నాట్కో ఫార్మా అంచనా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని