డియాజియో సీఈఓ ఐవన్‌ మెనేజెస్‌ మృతి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్కహాల్‌ కంపెనీ అయిన డియాజియో సీఈఓ ఐవన్‌ మెనేజెస్‌ మృతి చెందారు. ఉదర అల్సర్‌ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం కన్నుమూశారు.

Published : 08 Jun 2023 02:32 IST

భారత సంతతి వ్యక్తి ఈయన

దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్కహాల్‌ కంపెనీ అయిన డియాజియో సీఈఓ ఐవన్‌ మెనేజెస్‌ మృతి చెందారు. ఉదర అల్సర్‌ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం కన్నుమూశారు. ఈ నెలాఖరులో ఐవన్‌ పదవీ విరమణ చేయాల్సి ఉంది. ‘సర్‌ ఐవన్‌ మెనేజెస్‌ మృతిపై డియాజియో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంద’ని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. మెనేజెస్‌ స్థానంలో భావి సీఈఓగా దేబ్రా క్రూను మార్చి 28న కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జానీ వాకర్‌ విస్కీ, టాంకరే జిన్‌, డాన్‌ జూలియో టకీలా వంటి 200 బ్రాండ్లను డియాజియో తయారుచేసి, 180 దేశాల్లో పైగా విక్రయిస్తోంది.

పుట్టి పెరిగింది భారత్‌లోనే..

ఇండియన్‌ రైల్వే బోర్డ్‌ మాజీ ఛైర్మన్‌ మాన్యుయేల్‌ మెనేజెస్‌ కుమారుడే ఐవన్‌. ఈయన పుణెలో జన్మించారు. అమెరికాలోని కెలాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో చేరడానికి ముందు దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌లో ఆయన విద్యనభ్యసించారు. 1997లో డియాజియోలో ఐవన్‌ చేరారు. 2012 జులైలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగి, 2013 జులైలో సీఈఓగా మారారు. ఐవన్‌ సోదరుడు విక్టర్‌ సిటీ బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌, సీఈఓ.. కాగా, ఐవన్‌కు భార్య షిబానీ, కుమారుడు నిఖిల్‌, కుమార్తె రోహిణి ఉన్నారు. ఐవన్‌కు బ్రిటన్‌, అమెరికా పౌరసత్వం ఉండగా.. భారత్‌ వరకు ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని