సంక్షిప్త వార్తలు

టెక్నాలజీ రంగంలో స్వీయ నియంత్రణ ముఖ్యమని.. కృత్రిమ మేధ పరిజ్ఞానం కారణంగా కంపెనీల చేతిలోకి ప్రపంచం వెళ్లకూడదని చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ అభిప్రాయపడ్డారు.

Published : 09 Jun 2023 02:14 IST

కంపెనీల చేతిలోకి ప్రపంచం వెళ్లకూడదు
ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌

దిల్లీ: టెక్నాలజీ రంగంలో స్వీయ నియంత్రణ ముఖ్యమని.. కృత్రిమ మేధ పరిజ్ఞానం కారణంగా కంపెనీల చేతిలోకి ప్రపంచం వెళ్లకూడదని చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్‌లో కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడం, నియంత్రణపరమైన అవసరాలపై చర్చించామని ఆల్ట్‌మన్‌ వెల్లడించారు. ఓపెన్‌ఏఐ సంస్థకు స్వీయ నియంత్రణ ఉందని, చాట్‌జీపీటీ సురక్షితమని చెప్పడానికి దాదాపు 8 నెలలు వెచ్చించామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆన్‌లైన్‌లో సమాచారం వెతకడం నుంచి, చాట్‌జీపీటీ వినియోగించడానికి మొగ్గుచూపుతున్నారని తెలిపారు. పాఠ్యాంశాలు, టెక్నాలజీ అభివృద్ధి, సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ రాయడం వంటివాటికి చాట్‌జీపీటీని వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


జెన్‌ టెక్నాలజీస్‌కు రూ.202 కోట్ల ఆర్డర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ ఉత్పత్తుల రంగానికి చెందిన హైదరాబాద్‌ కంపెనీ, జెన్‌ టెక్నాలజీస్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా రూ.202 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించింది. వచ్చే త్రైమాసికంలో మరికొన్ని ఆర్డర్లు లభించే అవకాశం ఉన్నట్లు జెన్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. 3 దశాబ్దాలుగా మిలటరీ శిక్షణ ఉత్పత్తులు అందిస్తున్న ఈ సంస్థ కొత్తగా డ్రోన్ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా ‘ట్రైనింగ్‌ సిస్టమ్స్‌’ సరఫరా చేసిన ఘనత ఈ సంస్థకు ఉంది. తన ఉత్పత్తులకు సంబంధించి దాదాపు 110 పేటెంట్ల దరఖాస్తులను జెన్‌ టెక్నాలజీస్‌ దాఖలు చేసింది.


సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ 6 కాఫీ బ్రాండ్ల కొనుగోలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్టెంట్‌ కాఫీ పొడిని ఉత్పత్తి చేసే సంస్థ అయిన సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ (ఇండియా) లిమిటెడ్‌, స్వీడన్‌ కేంద్రంగా పనిచేసే కాఫీ రోస్టర్స్‌ లాఫ్‌బర్గ్స్‌ గ్రూపు నుంచి 6 కాఫీ బ్రాండ్లు కొనుగోలు చేసింది. దీని కోసం 5.50 లక్షల పౌండ్లు (సుమారు రూ.5.68 కోట్లు) చెల్లించింది. ఈ ఆరు కాఫీ బ్రాండ్లలో- పెర్కోల్‌, రాకెట్‌ ఫ్యూయల్‌, ప్లాంటేషన్‌ వార్ఫ్‌, ది లండన్‌ బ్లెండ్‌, పెర్క్‌ అప్‌, పర్కోల్‌ ఫ్యూజన్‌ ఉన్నాయి. వీటిని సొంతం చేసుకోవటం వల్ల యూకేలోని కొన్ని ప్రముఖ సూపర్‌మార్కెట్లకు ఇన్‌స్టెంట్‌ కాఫీ అందించే అవకాశం లభిస్తుందని సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ పేర్కొంది. ఐరోపాలో పెర్కోల్‌ బ్రాండు పేరుతో ఇన్‌స్టెంట్‌ కాఫీ, రోస్ట్‌, గ్రౌండ్‌ కాఫీ, కాఫీ బ్యాగ్‌లు లభిస్తున్నాయి. ఈ బ్రాండ్లలో కొన్నింటికి సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ కొంతకాలంగా ఇన్‌స్టెంట్‌ కాఫీ సరఫరా చేస్తోంది.


ఇళ్ల అమ్మకాలు బాగుంటాయ్‌: క్రెడాయ్‌

కీలక రేట్లలో ఎటువంటి మార్పు చేయకపోవడంతో నెలవారీ కిస్తీ పెరగదు కాబట్టి ఇళ్ల అమ్మకాల్లో వృద్ధి కొనసాగుతుందని క్రెడాయ్‌ అంచనా వేస్తోంది. ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠ స్థాయిలో ఉన్నందున, వచ్చే సమావేశంలో రేట్ల కోతను ఆశిస్తున్నట్లు పేర్కొంది.


ఔషధ ఉత్పత్తుల ఎగుమతులు-దిగుమతులకు అదనపు వివరాలివ్వాలి

దిల్లీ: జులై 1 నుంచి ఔషధ ఉత్పత్తుల ఎగుమతులు-దిగుమతులకు అదనపు వివరాల ఇచ్చే ప్రక్రియను కస్టమ్స్‌ విభాగం తీసుకొచ్చింది. త్వరితగతిన షిప్‌మెంట్‌లకు అనుమతులు ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఔషధ ప్లాంట్లు, రసాయనాల వాణిజ్యం చేసే ఎక్సిమ్‌ వ్యాపారులు తరచుగా అడిగే ప్రశ్నలు ఈ అదనపు వివరాల వల్ల తగ్గనున్నాయి. ఔషధ ప్లాంట్‌లు, ప్లాంట్‌ భాగాల పేర్లను తప్పనిసరి చేయాలని నిర్ణయించామని, ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, డీజీఎఫ్‌టీతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఐసీ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని